Warangal District : వివాహేతర సంబంధం.. భార్యతో గొడవ.. తండ్రిని చంపేసిన కొడుకు.. పోలీసుల ఎంట్రీతో అసలు గుట్టురట్టు

వరంగల్ జిల్లా (Warangal District) లో దారుణ ఘటన జరిగింది. కొడుకు తన తండ్రిని హత్యచేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Warangal District

Warangal District : వరంగల్ జిల్లా (Warangal District) లో దారుణ ఘటన జరిగింది. కొడుకు తన తండ్రిని హత్యచేశాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని భార్యపై భర్త దాడి చేశాడు. ఈ సమయంలో అతని తండ్రి అడ్డుపడటంతో అతడిని హత్య చేశాడు. ఈ ఘటన వర్ధన్నపేటలో జరిగింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

వర్దన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని గుబ్బడి తండాకు చెందిన సురేశ్‌కు 2019లో తాళ్లకుంటకు చెందిన మౌనికతో వివాహం జరిగింది. అయితే, సురేశ్ మద్యానికి బానిసై నిత్యం భార్యను కొడుతుండేవాడు. సురేశ్‌కు ఓ యువతితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భార్య మౌనికకు తెలియడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తరువాత సురేశ్ పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని మౌనికను మళ్లీ ఇంటికి తీసుకొచ్చుకున్నాడు.

సురేశ్ వివాహేతర సంబంధం గురించి తండ్రి రాజాకు తెలియడంతో కొడుకును మందలించాడు. దీంతో సురేశ్ తన తండ్రి, భార్యపై కక్ష పెంచుకున్నాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్న వారిద్దరి అడ్డు తొలగించుకునేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఈనెల 6వ తేదీ (శనివారం) మద్యం తాగొచ్చిన సురేశ్.. ప్రశ్నించిన భార్య మౌనికతో గొడవపడి ఆమెను కొట్టాడు.

భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుండటాన్ని గమనించిన తండ్రి రాజా అక్కడికి చేరుకొని కొడుకు సురేశ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఆగ్రహానికి గురైన సురేశ్ తండ్రి రాజా ఛాతిపై బలంగా కొట్టాడు. ఆ తరువాత చీరతో మెడకు ఉరివేసి హత్య చేసి.. అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి రాజా మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు. నిందితుడు సురేశ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.