CM Revanth Reddy
పదవుల కోసం కొందరు.. పదవుల వచ్చి కూడా పైసా ఉపయోగం లేదని మరి కొందరు.. రాబోయే పదవులు రావని మరికొందరు.. ఇలా హోల్ సేల్ గా… హస్తం పార్టీలో అందరిలో కామన్ గా కనిపిస్తోంది. అందుకే వారిలో టన్నుల కొద్ది అసంతృప్తి బయటకు తన్నుకొస్తుంది.
అవును.. ఇదే ఇప్పుడు అధికార పార్టీలో… దర్శనమిస్తున్న చిత్రం. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఎవరిని కదిలించినా.. ఒక్కటే మాటట. కడుపు చించుకుంటే కాళ్లపై పడుతుందంటూ.. లోలోపలే కాదు… ఏకంగా సెక్రటేరియట్ నుండి… గాంధీ భవన్ గేట్ వరకు హస్తం నేతల్లో కన్పిస్తోందట.. విన్పిస్తోందట.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావొస్తోంది. ఆరు గ్యారంటీలు సహా పలు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం ఒక్కో పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తోంది. గత బీఆర్ఎస్ చేసిన అప్పులు, వాటికి వడ్డీలు చెల్లిస్తూ మరోవైపు..అభివృద్ది, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ… కష్టాలతో నెట్టుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇదిలా ఉంటే పార్టీలో, పాలనలో అధికార పార్టీ నేతల తీరు మరోరకంగా ఉంది. పవర్ లోకి వచ్చినా…పవర్ లేకుండా పోయిందని కొందరు…ఏళ్ళ తరబడి కంట్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నా..పదవులు రావడంలేదని మరికొందరు…నిత్యం ఇలా అసంతృస్తితో రగిలిపోతున్నారట. ఇదే ఇప్పుడు సర్కార్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందట.
అవును గెలిచిన ఎమ్మెల్యేల నుంచి పార్టీలో దశాబ్దాలుగా జెండా పట్టుకుని తిరుగుతున్న వారందరిలో ఇప్పుడు టన్నుల కొద్ది ఆగ్రహావేశాలు, అసంతృప్తి జ్వాలలు..ఆరని కోపాల్ తాపాల్ ఎగిసి పడుతున్నాయట. దీనికి అద్దం పట్టేలా మొన్నామధ్య..నల్గొండ జిల్లాకు చెందని అధికార పార్టీ ఎమ్మెల్యే..సెక్రటేరియేట్ గేట్ ముందు వ్యక్తం చేసిన ఆగ్రహం.
ఎమ్మెల్యేగా గెలిచి..నియోజకవర్గ సమస్యల పరిష్కారం చేయలేక పోతున్నానంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారట. అంతేకాదు తమ సమస్యలు మంత్రులకు చెప్పినా..అధికారులకు చెప్పినా…ఫైల్ మాత్రం సెక్రటేరియట్ గేట్ కూడా దాటడం లేదని ఊగిపోయిన ఆ సదరు ఎమ్మెల్యే..ఏకంగా తన చేతిలో ఉన్న ఫైల్ ను విసిరికొట్టి తన ఆగ్రహాన్ని కొంత చల్లార్చుకున్నారట. ఇదే పరిస్థితి అధికార పార్టీలో ఉన్న మెజారిటి ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నారని టాక్.
గాంధీభవన్‌లో నేతల ధర్నాలు
ఇక గెలిచిన హస్తం పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఇలా ఉంటే.. పార్టీ పదవులకోసం గాంధీభవన్ లో నేతలు ధర్నాలకు దిగుతున్నారు. ఏకంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు..పార్టీ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని గాంధీభవన్ లో ధర్నాకు దిగడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్, సీఎం, కొందరు మంత్రులు తమ వారికే పదవులు కట్టబెడుతున్నారంటూ ఆమె బహిరంగంగా టార్గెట్ చేయడంతో అధికారంలో ఉన్న హస్తం పార్టీ పరువు గాంధీభవన్ గేట్ దాటిందనే చర్చ నడుస్తోంది.
వచ్చే పార్టీ కార్యవర్గంలో కూడా పార్టీకి పనిచేసిన వారికి కాకుండా..పదవుల్లో ఉన్న కొందరు… తమ వారికి పంచుతారని..పార్టీ ఎంపికను తప్పుబడుతూ సునీతా రావ్ రేపిన మంటలు హస్తం పార్టీ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారిందట. ప్రెసిడెంట్, సీఎం వాళ్ల మనుషులకే పదవులు ఇచ్చుకుంటే మరి పార్టీలో మిగతా వారి పరిస్థితి ఏంటంటూ గాంధీభవన్ లో కొందరు సీరియర్ నేతలు లోలోపల గొనుక్కొంటున్నారట.
వీరి పరిస్థితి ఇలా ఉంటే..ఏడాదిన్నర అయినా..పూర్తి కెబినెట్ ను విస్తరించకపోవడంపై సీనియర్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఖాళీగా ఉన్న ఆరు బెర్త్ లకు డజన్ మంది ఎమ్మెల్యేలు గురి పెట్టుకుని కూర్చున్నారు. ఎవరికి వారు ఢిల్లీ పెద్దలను, సీఎం, సీనియర్ మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. కులాలు, ప్రాంతాలు, ఆర్థిక, అంగ బలం.. ఇలా తమ క్వాలిటిస్ ను ఢిల్లీ పెద్దల చెవికి తాకేలా ఎవరికి వారు లాబీయింగ్ చేసుకునే పనిలో ఉన్నారు.
ఇంత జరగుతున్నా క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ డైలీ సీరియల్ ను తలపిస్తుండటంతో కొందరు బయటికి అసంతృప్తిని వెళ్లగక్కుతుంటే..మరి కొందరు లోలోపలే అసంతృతో రగిలిపోతున్నా.. గాడ్ ఫాదర్లను నమ్ముకుని పెదవి దాటనీయడం లేదు.
ఖాళీ ఖజానాతో..కష్టాలకు ఓర్చీ పాలన సాగిస్తున్నా.. వీటిని పట్టించుకోకుండా పదవులకోసం, నేతలు ఇంతగా పాకులాడుతారా..? ప్రభుత్వాన్ని ఓన్ చేసుకోకపోతే ఎలా…? ప్రభుత్వం అంటే తానొక్కడినే కాదని సీఎం రేవంత్ ఎమ్మెల్యేలకి నొక్కి చెప్తున్నారట. ఇలాగైతే ఎలా అంటూ సీఎం సైతం అసంతృప్తితో ఉన్నారన్న టాక్ విన్పిస్తోంది.
ఇలా మొత్తానికి అధికార పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి నుండి మొదలుకొని ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు…ఇలా అందరిలో..సంతృప్తి లెవల్ తగ్గిపోయి.. అసంతృప్తి జ్వాలలు మాత్రం ఎగిసెగిసి పడుతున్నాయట. మరి వీటికి ఢిల్లీ పెద్దలు ఎలా బ్రేకులు వేస్తారో చూడాలి మరి.