Mee Seva - E Seva
Mee Seva – E Seva Centers : ఇన్ స్టంట్ అప్రూవల్ విధానంలో మీ సేవ, ఈ సేవ కేంద్రాల నుంచి జారీ అయిన నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలకు సంబంధించిన కేసుపై సీసీఎస్ పోలీసులు ముమ్మరం దర్యాప్తు చేపట్టారు. మీ సేవ, ఈ సేవ కేంద్రాల నుంచి ఇప్పటివరకు 15వేల నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలు జారీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తెల్ల కాగితాలు అప్ లోడ్ చేసి నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలు పొందినట్లు, ఈ నకిలీ ధ్రువపత్రాల వ్యవహారంలో మీ సేవ, ఈ సేవ కేంద్రాల నిర్వాహకులు కీలక పాత్ర పోషించినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది.
నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారంపై జీహెచ్ఎంసీ అధికారులు మార్చి నెలలో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇన్ స్టంట్ అప్రూవల్ విధానం ద్వారా మీ సేవ, ఈ సేవ కేంద్రాల నుంచి 50 కంటే ఎక్కువగా జనన, 100 కంటే ఎక్కువగా మరణ ధ్రువపత్రాలు జారీ చేసిన కేంద్రాలను గుర్తించారు. ఎక్కువగా చార్మినార్ పరిసరాల నుంచే ఈ నకిలీ పత్రాలు జారీ అయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
అఫ్జల్ గంజ్, అంబర్ పేట, ఆసిఫ్ నగర్, బహదూర్ పుర, చార్మినార్, మొఘల్ పుర, సైదాబాద్, యాకుత్ పురా, బోయిన్ పల్లి, చిక్కడపల్లి, చిలకలగూడ, గోల్కొండ, కాచిగూడ, నల్లకుంట, సైఫాబాద్, షాహినాయత్ గంజ్ ప్రాంతాల్లోని 25 కేంద్రాల్లో ఈ సేవ, మీ సేవ నిర్వాహకులు ఇన్ స్టంట్ అప్రూవల్ విధానాన్ని దుర్వినియోగం చేసి, నకిలీ ధ్రువ పత్రాలు జారీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో 25 మీ సేవ, ఈ సేవ కేంద్రాల నిర్వాహకులను సీసీఎస్ పోలీసులు విచారించారు. 15వేల వరకు నకిలీ సర్టిఫికేట్లు జారీ అయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసులో ఇంకా ఎంత మంది పాత్ర ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.