PRC
Telangana prc statement : సీఎం కేసీఆర్ ప్రకటనతో ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.. ఉద్యోగ సంఘాల నేతలు. ఉద్యోగుల బాధలు అర్ధం చేసుకున్న మంచి మనసున్న సీఎం అంటూ కొనియాడారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఉద్యోగుల పీఆర్సీపై అసెంబ్లీలో ప్రకటించారు. ఉద్యోగులకు 30శాతం ఫిట్‌మెంట్ ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటన చేశారు. 2020 ఏప్రిల్ 30 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, హోంగార్డులకు, వీఆర్ఏ, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలకు కూడా పీఆర్సీ వర్తిస్తుందని సీఎం ప్రకటించారు.
తాజా పీఆర్సీతో 9 లక్షల 17 వేల 797 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. అలాగే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపుపైనా కేసీఆర్ శుభవార్త అందించారు. రిటైర్మెంట్ వయసును 61ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవల్ని వినియోగించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఒక్క శాతం ఫిట్‌మెంట్‌కు ఏటా 300 కోట్ల రూపాయలు ఖజానాపై భారం పడుతుందనేది ఆర్థిక శాఖ అంచనా. ఈ లెక్కన 30 శాతం ఇస్తే 9 వేల కోట్ల రూపాయల అదనపు భారం ఖజానాపై పడనుంది. తెలంగాణలో ఉద్యోగులకు 30శాతం ఫిట్‌మెంట్ ప్రకటనపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.