మార్చి వరకు ఉచిత బియ్యం!

  • Publish Date - October 30, 2020 / 06:30 AM IST

central government will be distribute free rice : కరోనా నుంచి పేదలు ఇంకా కోలుకోలేదని కేంద్రం భావిస్తోంది. అందువల్ల పేదలకు ప్రస్తుతం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీని కంటిన్యూ చేయాలని యోచిస్తోంది. వచ్చే ఏడాది మార్చి వరకు దీనిని పొడిగించనన్నట్లు సమాచారం. దీనిపై వచ్చే నెల తొలి లేదా రెండో వారంలో కేంద్రం ఓ ప్రకటన చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద బియ్యాన్ని ఉచితంగా పేదలకు పంపిణీ చేస్తోంది. నవంబర్ వరకు ఇది కొనసాగనుంది.



కానీ…కరోనా నేపథ్యంలో పేద, మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమయ్యాయి. అంతేగాకుండా..భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా నష్టపోయాయి. నిర్మాణ రంగం కూడా ఇంకా కోలుకోక పోవడంతో వలస కార్మికులు దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో..ఉచిత బియ్యం పంపిణీ కొనసాగించాలని వివిధ రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి.



కరోనా కారణంగా కేంద్రం విధించిన లాక్ డౌన్ తో చాలా మంది ఉపాధి కోల్పోయారు. పేద, మధ్య తరగతి ప్రజలకు రేషన్ కార్డుదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు ఉచితంగా ఒక్కొక్కరికీ 5 కిలోల బియ్యంతో పాటు…కార్డున్న ఒక్కో కుటుంబానికి కిలో చొప్పున కందిపప్పును పంపిణీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 2.80 కోట్ల మంది రేషన్ లబ్దిదారులున్నారు. వీరిలో జాతీయ ఆహార భద్రత చట్టం కింద 1.91 కోట్ల మంది ఉన్నారని అంచనా.



కేంద్రం ఇస్తున్న 5 కిలోల బియ్యానికి అదనంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో 7 కిలోలు కలిపి ఇచ్చింది. దీంతో పేదలకు 12 కిలోలు బియ్యం అందుతున్నాయి. ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.