chandrababu telangana tdp: కరోనా లాక్‌డౌన్ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ కేంద్రంగానే రెండు రాష్ట్రాల పార్టీ కార్యకలాపాలను సాగిస్తున్నారు. అడపాదడపా మాత్రమే ఏపీకి వెళ్లి పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల కాలంలో చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అవుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో బాబు తెలంగాణ టీడీపీపై మరింతగా దృష్టి సారించినట్టుగా చెబుతున్నారు. ఈ మధ్యనే టీ-టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణకు మరోసారి అవకాశం ఇచ్చారు. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల లక్ష్యంగా అధినేత వ్యూహాలు రచిస్తున్నారని అంటున్నారు.
పార్టీని బతికించేందుకు ప్రయత్నాలు:
పార్టీ కోసం పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న నాయకులతో పాటు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి రాష్ట్ర నాయకత్వ బాధ్యతల్లో చంద్రబాబు పెద్ద పీట వేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ముఖ్యంగా తెలంగాణలో మరింత దారుణంగా ఉంది. దీంతో కష్టకాలంలో రెండు రాష్ట్రాల్లో పార్టీని బతికించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు చంద్రబాబు. తెలంగాణలో బలపడాలంటే చాలా సమయమే పట్టే అవకాశం ఉందంటున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి పావులు:
పార్టీ కేడర్‌తో పాటు నాయకులను యాక్టివ్ చేసేందుకు జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఫోకస్ పెడుతున్నారు చంద్రబాబు. గతంలో హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ పాత్ర చాలా ఎక్కువగానే ఉందని గుర్తు చేస్తున్నారు. దీంతోపాటు పార్టీలో గ్రేటర్ హైదరాబాద్ నుంచే చాలామంది నాయకులు ప్రస్తుతం వివిధ పార్టీల్లో రాణిస్తున్నారు. పార్టీకి ఇప్పటికీ గ్రేటర్‌లో కార్యకర్తలు, అభిమానులు ఎక్కువగానే ఉన్నారని అంటున్నారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్ర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీటన్నింటినీ లెక్కలేసుకొని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ పడేందుకు ఆ పార్టీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోందని అంటున్నారు.
ఉనికే కోల్పోయిందంటూ సాగుతున్న ప్రచారానికి బ్రేకులు వేసేందుకు చంద్రబాబు స్కెచ్:
పార్టీ ఉనికే కోల్పోయిందంటూ సాగుతున్న ప్రచారానికి బ్రేకులు వేయాలంటే.. ఒకప్పుడు పార్టీకి గుండెకాయలా నిలిచిన హైదరాబాద్‌లో తిరిగి సత్తా చాటేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. సెటిలర్ ఓటర్లను తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు చూస్తోందని అంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ఇప్పటి నుంచే కిందిస్థాయి కేడర్‌ను బలోపేతం చేసుకునేందుకు చర్యలు చేపడుతోంది. ఇటీవల జరిగిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో చంద్రబాబు పలు సూచనలు చేశారని అంటున్నారు.
అభిమానులు, ప్రజలు పార్టీకి దగ్గరయ్యేందుకు ప్లాన్:
పార్టీలో నేతలంతా ఐక్యంగా ఉండాలని, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని, పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్లే ప్రస్తుతం తెలంగాణలో ఉన్నారని అధినేత చంద్రబాబుతో పాటు పలువురు నేతలు కూడా భావిస్తున్నారు. పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తలను యాక్టివ్ చేస్తే అభిమానులు, ప్రజలు దగ్గరవుతారని చంద్రబాబు చెబుతున్నారట. రాష్ట్ర పార్టీ కో-ఆర్డినేషన్ కమిటీ 100 రోజుల ప్రణాళికతో కార్యక్రమాలు రూపొందించింది. ప్రజల్లోకి వెళ్లేందుకు వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. మూడు నెలలకు ఒకసారి కార్యక్రమాలపై సమీక్ష చేయనున్నారు. గత ఎన్నికల్లో చేసిన తప్పిదాలను పునరావృతం కాకుండా పూర్తిగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని, నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి చంద్రబాబు ఆశలు ఎంత వరకూ ఫలిస్తాయో చూడాల్సిందే.