×
Ad

Chevella Bus Incident : చేవెళ్ల బస్సు ప్రమాదం.. టిప్పర్ ఢీకొట్టినదానికంటే కూడా దీని వల్ల ఎక్కువమంది చనిపోయారు.. పాపం..

Chevella Bus Incident ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణీకులు ఉన్నారు. బస్సును టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టిన సమయంలో

Chevella Bus Incident

Chevella Bus Incident : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు, లారీ డ్రైవర్లు సహా 19మంది మరణించారు. అయితే, ఈ ప్రమాదం అనేక కుటుంబాల్లో అంతేలేని విషాదాలను నింపింది. ప్రమాదం స్థలి వద్ద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ ప్రమాదంలో టిప్పర్ ఢీకొట్టిన దానికంటే అందులోని కంకర బస్సులో పడడం కారణంగానే మృతుల సంఖ్య పెరిగినట్లు ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు పేర్కొంటున్నారు.

ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణీకులు ఉన్నారు. బస్సును టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టిన సమయంలో బస్సు డ్రైవర్ తోపాటు.. డ్రైవర్ వెనుభాగంలో సీట్లలో కూర్చుకున్న వారు స్పాట్ లో మరణించారు. ప్రమాదం జరిగిన క్షణాల్లో టిప్పర్ ట్రక్కు బస్సుపైకి ఒరిగింది. దీంతో ట్రక్కులోని కంకర ఒక్కసారిగా బస్సులోని ప్రయాణికులపై పడింది. బస్సు ముందు భాగంలో కూర్చున్న అనేక మంది కంకర కింద పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు మొదలు కావటంతో పలువురు ప్రాణాలతో బయటపడ్డారు.

టిప్పర్ లారీ ట్రక్కులోని కంకర ఒక్కసారిగా బస్సుపై పడడంతో చాలా మంది ప్రయాణికులు కంకర కింద కూరుకుపోయారు. కొందరు ప్రయాణికులు సగం వరకు కంకరలో కూరుకుపోయారు.. మమ్మల్ని కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేశారు.

అటువైపుగా వెళ్తున్న వాహనదారులు వెంటనే అప్రమత్తమై వారినిపైకి లాగేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని జేసీబీ సహాయంతో కంకరను పక్కకు తొలగించి వారిని బయటకు తీశారు.

మరోవైపు.. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 10మందికిపైగా స్పాట్ లో మరణించగా.. మరికొందరు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 19మంది మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.