Chicken
తెలంగాణలో చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. కొంత కాలంగా బర్డ్‌ఫ్లూ భయంతో జనాలు చికెన్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో దాదాపు ఎనిమిది వారాలుగా చికెన్ ధరలు కిలోకి రూ.150 – రూ.180 మధ్య ఉన్నాయి.
ఇప్పుడు బర్డ్‌ఫ్లూపై జనాల్లో భయం పోతోంది. కోడి మాంసానికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో కిలో చికెన్ ధర రూ.250 – రూ.300 మధ్య ఉంది. ఇటీవల రంజాన్‌తో పాటు ఉగాది వంటి పండుగలకు రావడంతో చికెన్ కొనుగోళ్లు పెరిగాయి.
అయితే, ఎండాకాలంలో కోళ్ల ఉత్పత్తి తగ్గింది. డిమాండ్ పెరిగినా కోళ్లు అంతగా లేకపోవడంతో ధరలు ఒక్కసారిగా పెరిగినట్లు సమాచారం. బర్డ్ ఫ్లూ కారణంగా కొంత కాలంగా చికెన్ అమ్మకాలు పడిపోయాయి.
Also Read: తెలంగాణలోని పేదలకు నిత్యావసర సరుకుల కిట్..!
పౌల్ట్రీ రైతులు నష్టాలు చవిచూశారు. చాలా మంది రైతులు కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. ఇప్పుడు క్రమంగా చికెన్ కొనుగోళ్లు పెరుగుతున్నా కోళ్లు లేవు. అయితే, చికెన్ ధరలు ఇప్పుడు పెరిగినప్పటికీ పౌల్ట్రీ రైతులకు నష్టాలే వస్తున్నాయి.
ఎలాగంటే..రైతులు 2 కిలోల కోడిని పెంచడానికి దాదాపు 40 రోజుల సమయం పడుతోంది. వారికి అందుకోసం రైతులకు రూ.200 ఖర్చు అవుతుంది. చికెన్ కేంద్రాలకు కోళ్లను సరఫరా చేసేవారు రైతులకు కిలోకు రూ.80 – రూ.100 మధ్య ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రైతులు నష్టపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు చికెన్ కొనుగోళ్లకు మళ్లీ ఆసక్తి చూపుతున్నారు.