Chintala Ramachandra Reddy: హైదరాబాద్ విశ్వనగరమా, విషాద నగరమా.. చిన్న పాటి వర్షానికే మునక?

చిన్న పాటి వర్షానికి హైదరాబాద్ లో కాలనీలు మునిగిపోతున్నాయి.. ఇది విశ్వనగరమా.. విషాద నగరమా అని బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు.

Chintala Ramachandra Reddy: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామన్న హామీలు మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులను అభివృద్ధి పనులకు వినియోగించడం లేదని అన్నారు. హైదరాబాద్ లో చేపట్టిన అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

“చిన్న పాటి వర్షానికి హైదరాబాద్ (Hyderabad) లో కాలనీలు మునిగిపోతున్నాయి. నాలాల నుంచి వెళ్లాల్సిన వరద నీరు రోడ్లపై ప్రవహిస్తుంది. ఇది విశ్వనగరమా.. విషాద నగరమా? హైదరాబాద్ ను అభివృద్ధి చేయడానికి తొమ్మిదేళ్లు సరిపోలేదా? విశ్వనగరం చేసేందుకు 60 వేల కోట్లతో అభివృద్ధి చేశామన్నారు.. 60 వేల కోట్లు ఎక్కడికి పోయాయి? హైదరాబాద్ చుట్టూ నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కడతానన్న కేసీఆర్ ఎందుకు కట్టలేదో సమాధానం చెప్పాలి.

నాలాల్లో పూడిక తీయడం లేదు. నిజాం కాలం నాటి వాటర్, సివరేజ్ పైల్ లైన్స్ ను విస్తరించలేదు. కనీసం కుక్కలను కూడా నియంత్రించలేకపోతున్నారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నాలాలను కబ్జా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నిధులన్నీ హైదరాబాద్ నుంచి వస్తున్నా నగరాభివృద్ధి నిర్లక్ష్యం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి.

Also Read: ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం మనకన్నా తక్కువ: సీఎం కేసీఆర్

రాష్ట్ర ప్రభుత్వానికి అసలు విజన్ ఉందా? ట్యాంక్ బండ్ లో మంచి నీళ్ళు నింపుతామన్న కేసీఆర్ ఎందుకు పట్టించు కోవడం లేదు? హైదరాబాద్ కు ఎందుకు గోదావరి నీళ్లు రావడం లేదు? హైదరాబాద్ అంటే ఎందుకంత చిన్నచూపు? హైదరాబాద్ లో ఎన్ని రిజర్వాయర్లు, ట్యాంకులు కట్టారో ఈ ప్రభుత్వం చెప్పాలి. మూసీ నది సుందరీకరణ చేస్తామని చైర్మన్ ను కూడా నియమించారు. మూసీ నది (Musi River) సుందరీకరణ ఏమైంది కేసీఆర్? ఈ సమస్యలన్నింటిపై ఉద్యమిస్తామ”ని చింతల రామచంద్రారెడ్డి అన్నారు.

Also Read: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. ఈసారి ఎవరి పని పడుతున్నారంటే..

ట్రెండింగ్ వార్తలు