ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు

CM KCR key decision on EWS reservations : తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యుఎస్) రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి మరో రెండు, మూడు రోజుల్లోనే ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.

ఈ విషయంపై రెండు మూడు రోజుల్లోనే ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి, తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంద‌న్నారు. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఈడబ్ల్యుఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించామ‌ని తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని చెప్పారు. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లతో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.