cm kcr: తెలంగాణతో పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వందేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయక చర్యల కోసం కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. నగరంలోని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెప్పారు. వరద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
వందేళ్లలో ఎప్పుడూ చూడని కుండపోత వర్షం:
భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ అతలాకుతలమైంది. వందేళ్లలో ఎప్పుడూ చూడని కుండపోత వర్షం నగరాన్ని ముంచెత్తింది. ఆకాశానికి చిల్లు పడింది అనే అనుమానం కలుగుతోంది. నిన్నటి నుంచి మళ్లీ వర్షం కురుస్తోంది. ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ వరదల్లో హైదరాబాద్ వాసుల బాధలు వర్ణణాతీతం. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. నాలాలు, మ్యాన్ హోల్స్ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాన రహదారులు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జల మయమయ్యాయి. ఎటు చూసినా వరద, బురద కష్టాలే. అనేకమంది సర్వస్వం కోల్పోయారు. కట్టుబట్టలతో మిగిలారు. కొన్ని ఇళ్లు నేల కూలాయి. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇంకా చాలా ఇళ్లు నీళ్లలో నానుతున్నాయి.
ఇళ్ల నుంచి బయటకు రావొద్దు:
వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్లలోంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. అటు… పాత భవనాలు భయపెడుతున్నాయి.. ఎప్పుడు భారీ వర్షాలు కురిసినా.. ఆ పాత భవనాలు కూలి కొందరు ప్రాణాలు కోల్పోవలసి వస్తోంది. దీంతో GHMC అధికారులు ముందుగానే అలర్ట్ అయ్యారు. శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి కూల్చివేస్తున్నారు.
https://10tv.in/cm-kcr-review-on-floods-in-telangana-state-send-report-to-center-on-rains/
ఏపీ నుంచి బోట్లు తెప్పించిన కేసీఆర్:
నాలాల్లో పేరుకుపోయిన చెత్తను యుద్ధ ప్రాతిపాదికన తొలగించే చర్యలు చేపట్టారు. చెత్త తీస్తూ ఉంటే ఆటోలు, బైకులు బయటకు వస్తున్నాయి. అటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవలందించేందుకు బోట్లు సిద్ధంగా ఉన్నాయి. నీటమునిగిన కాలనీల్లో సేవలను కొనసాగించేందుకు ఏపీ, తెలంగాణ టూరిజానికి చెందిన 40 బోట్లను హైదరాబాద్‌కు తరలించారు.