కార్పొరేట్ హాస్పిటల్స్‌పై సీఎం కేసీఆర్ సీరియస్

గ్రేటర్ హైదరాబాద్ శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులు నేపథ్యంలో యథేచ్ఛగా వ్యవహరిస్తున్న కార్పొరేట్ హాస్పిటళ్లపై సీఎం సీరియస్ అయ్యారు. ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలని ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ చేయడం.. డబ్బులు ఇవ్వలేని వారిని బెడ్లు ఖాళీ లేవని చెప్పి పంపించేయడం లాంటి ఘటనలే దీనికి నిదర్శనం. ఇటువంటి అంశాలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయి వార్నింగ్ ఇచ్చారు.

బెడ్లు ఖాళీగా ఉన్న డేటా అందుబాటులో ఉన్న సంఖ్య అనేది పారదర్శకంగా ఉండాలని దీని పట్ల అధికారులు శ్రద్ధ వహించాలని ప్రైవేట్ హాస్పిటల్స్ కు సూచించారు. కృత్రిమ కొరత సృష్టించి అవినీతికి పాల్పడి ప్రాణాలతో చెలగాటమాడితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు గ్రేటర్ పరిథిలోని ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటిపై నిఘా ఏర్పాటుచేస్తామని సీఎం అన్నారు.

మరోవైపు ఈ విషయంలో ప్రజలకు కూడా మెసేజ్ ఇచ్చారు. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లు ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లి లక్షల ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. గాంధీ, నిమ్స్‌లో 3వేల బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయని స్పష్టంచేశారు. మరోవైపు పెరిగిపోతున్న కేసులు, మరణాలపై స్పందించారు సీఎం. రాష్ట్రంలో రికవరీ రేటు 67శాతంగా ఉందని.. కాబట్టి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదనే ధైర్యాన్నిచ్చారు.

ప్రస్తుతం తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న 200 మంది మాత్రం కరోనాతో ఇబ్బంది పడుతున్నారని, మిగతావారంతా కోలుకుంటున్నారని కేసీఆర్ స్పష్టంచేశారు. కరోనా కట్టడిపై రివ్యూ మీటింగ్ పెట్టి మాట్లాడిన సీఎం.. వైరస్ వ్యాప్తి నివారణ చర్యల కోసం అదనంగా మరో 100 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పీజీ పూర్తిచేసిన 12వందల మంది వైద్యులను సర్వీసుల్లోకి తీసుకోవాలని అధికారులను ఆర్డర్ చేశారు.