Telangana Assembly Early Polls : తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నారా? అసెంబ్లీని రద్దు చేస్తారా? రేపు జరిగే టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో దీనిపై క్లారిటీ ఇస్తారా? జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడుతున్న కేసీఆర్ ఆ దిశగా పార్టీని సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సీఎం పీఠాన్ని కేటీఆర్ కు అప్పగిస్తారా అన్న దానిపై పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
కేంద్ర ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. మరో రెండేళ్ల తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికలు, ఏడాది తర్వాత జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నేతలను సిద్ధం చేస్తున్నారు కేసీఆర్. ఒకేరోజు మంత్రివర్గ సమావేశం, పార్టీ శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ నెలలో తీసుకున్న నిర్ణయాలను బేరీజు వేస్తున్న కొందరు నేతలు ముందస్తు ఎన్నికలను ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా అసెంబ్లీని రద్దు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే మునుగోడు ఉపఎన్నికలు ఎదుర్కొంటున్న సమయంలో అసెంబ్లీని రద్దు చేస్తారా? ఎన్నికల అనంతరం రాష్ట్ర రాజకీయాలపై నిర్ణయం తీసుకుంటారా? అన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్.. జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ పోషించే పాత్రపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో రైతు ఉద్యమాలతో మొదలుపెట్టి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఎలా వ్యవహరించాలన్న దానిపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇటీవల మూడు రోజుల పాటు జాతీయ రైతు సంఘం ప్రతినిధులతో జరిగిన చర్చల సారాంశాన్ని పార్టీ నేతలకు వివరించే చాన్స్ కనిపిస్తోంది. దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, జాతీయ రాజకీయాల్లో ఇప్పటివరకు టీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు, రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కిసాన్ సంఘటన్ పేరుతో జాతీయ రాజకీయాల్లో రైతులను ఏకంగా చేసే దిశగా పార్టీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దసరా పండుగ తర్వాత జాతీయ రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
జాతీయ రాజకీయాలకు తాను ఎక్కువగా సమయం కేటాయిస్తే రాష్ట్ర రాజకీయాల్లో, పరిపాలన వ్యవహారాల్లోనూ తలెత్తే పరిణామాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు నిర్వహించాలా? లేదంటే కేటీఆర్ ను సీఎం కుర్చీపై కూర్చోబెట్టాలా? అన్న అంశం చర్చకు వచ్చే ఛాన్స్ ఉందని గులాబీ నేతలు అంటున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు, నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
Telangana Assembly Early Polls, Will KCR dissolves Telangana assembly for early polls, Telangana chief minister K. Chandrashekar Rao, Telangana Assembly Sessions, Telangana Assembly Early Elections