Telangana Government : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బొనాంజా.. రెండు డీఏలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

Telangana Government : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక అందించింది. రెండు డీఏలు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు హైదరాబాద్‌లో 76 ప్రాంతాల పోలీస్ పరిధులను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది.

Telangana Government

  • తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
  • ఉద్యోగులకు పండుగ కానుక.. రెండు డీఏలకు ఓకే
  • రెండు డీఏలకు కేబినెట్ ఆమోదం

Telangana Government : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా వేళ కీలక శుభవార్త అందించింది. ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న డీఏలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది.

గురువారం (అక్టోబర్ 1) జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో రెండు డీఏలు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉత్కంఠకు తెరపడినట్లైంది. దసరా పండుగకు ముందు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు :
ఇదే కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపైనా చర్చ జరిగింది. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలోని 235 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్లు అధికారులు మంత్రివర్గానికి వివరించారు.

ఈ అంశాన్ని కేబినెట్ సబ్‌కమిటీలో మరింతగా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరువు పరిస్థితులపై త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Read Also : DSC 2.0 Notification : ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు భారీ అప్‌డేట్.. నెల రోజుల్లోనే నోటిఫికేషన్!

ఎల్‌నినో పరిస్థితులు, కరువు ప్రభావం, తీసుకోవాల్సిన ఉపశమన చర్యలపై సలహాలు, సూచనలు స్వీకరించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరువు మండలాలను ప్రకటించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సాయం కోరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని పరిస్థితులను కేంద్రానికి వివరించేందుకు కేంద్ర మంత్రులను కలవాలని రాష్ట్ర మంత్రులకు సీఎం రేవంత్ సూచించారు.

76 ప్రాంతాల్లో మార్పులు :
మరోవైపు హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోనూ తెలంగాణ ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. మొత్తం 76 ప్రాంతాలకు సంబంధించి జోన్లు, డివిజన్లు, పోలీస్‌స్టేషన్ల పరిధులను పునర్వ్యవస్థీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని ప్రాంతాలను ఇతర జోన్లు, డివిజన్లు, కమిషనరేట్‌ల పరిధిలోకి మార్చేసింది.

ఏయే ప్రాంతాల్లో మార్పులంటే? :
మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలను మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోకి బదిలీ చేశారు. శంషాబాద్, మహేశ్వరం, సైబరాబాద్ ప్రాంతాల్లోనూ పోలీస్ పరిధులను మార్చారు. ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ పేరును శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌గా మార్చి సంబంధిత పరిధుల్లోనూ అనేక మార్పులు చేశారు.

అబ్దుల్లాపూర్‌మెట్, రాజేంద్రనగర్, మీర్‌పేట్ ప్రాంతాలతో పాటు జూబ్లీహిల్స్, సనత్‌నగర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోనూ పోలీస్ పరిధుల పునర్విభజన జరిగింది. లా అండ్ ఆర్డర్‌తో పాటు ట్రాఫిక్ పోలీస్ పరిధుల్లోనూ మార్పులు చేపట్టారు. వుమెన్ సేఫ్టీ వింగ్, జోనల్ సైబర్ సెల్ పరిధులను కూడా పునర్వ్యవస్థీకరించారు. ప్రాంతాల వారీగా పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు రేవంత్ సర్కార్ తెలిపింది.