Miss World 2025: మిస్ వరల్డ్ 2025 ఫైనల్స్ సందడిగా జరుగుతున్నాయి. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరుగుతున్న ఈ అందాల పోటీల ఫైనల్స్ ఈవెంట్ కు అతిరథ మహారధులు తరలివచ్చారు. రాజకీయ, సినీ ప్రముఖులు ఈవెంట్ లో తళుక్కుమన్నారు. మిస్ వరల్డ్ టైటిల్ కోసం ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. కాసేపట్లో మిస్ వరల్డ్ విజేత ఎవరో ప్రకటించబోతున్నారు. కాగా, మిస్ వరల్డ్ ఫైనల్స్ ఈవెంట్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి దంపతులు హాజరయ్యారు.
అందాల భామ ఎవరో తేలిపోనుంది. ప్రపంచ సుందరిని ఎంపిక చేసే మిస్ వరల్డ్ కాంటెస్ట్ హైదరాబాద్ హైటెక్స్ లో కనుల విందుగా సాగుతోంది. మిస్ వరల్డ్ పోటీలకు 108 దేశాల నుంచి అందాల భామలు పోటీపడ్డారు. ఇండియా నుంచి నందిని గుప్తా పోటీ పడ్డారు. ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలకు జడ్జీలుగా జూలియా మోర్లీ, సోనూ సూద్, రానా దగ్గుబాటి, మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్, జయేశ్ రంజన్, మానుషి చిల్లర్, సుధారెడ్డి ఉన్నారు. సుమారు 20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో ముద్దుగుమ్మలు పాల్గొని తమ ప్రతిభను చాటడంతో పాటు తెలంగాణలో పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు.