Site icon 10TV Telugu

CM Revanth Reddy : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టారు. బుధవారం మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 11గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండల పరిధిలోని వేములకు ముఖ్యమంత్రి బయలుదేరుతారు. ఉదయం 11.30గంటల సమయంలో వేముల శివారులోని ఎస్‌జీడీ ఫార్మా రెండో యూనిట్‌ను ప్రారంభిస్తారు. 12.30 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి బయలుదేరి భద్రాచలం కొత్తగూడెం జిల్లా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారు.

Also Read: Telangana Govt : తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. సీబీఐ చేతికి మరో కేసు..?

సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం చండ్రుగొండకు హెలీకాప్టర్ ద్వారా చేరుకుంటారు. ఆ తర్వాత 2.35 నుంచి 2.50 గంటల వరకు బెండాలపాడులో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 2.50 నుంచి 3.05 గంటల వరకు ఇక్కడ నిర్మించిన పైలాన్‌ను ఆవిష్కరించి, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. అక్కడి నుంచి దామరచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకొని ప్రసంగిస్తారు. సాయంత్రం 4.25 గంటలకు చండ్రుగొండలోని హెలీప్యాడ్ నుంచి బయలుదేరి 5.40 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

ఢిల్లీకి భట్టి, తుమ్మల ..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఢిల్లీ పర్యటనకు వెళ్లుతుండడం విశేషం. సీఎం రేవంత్ ఆదేశాల మేరకే ఈ ఇద్దరు నేతలు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నట్లు సమాచారం. భారీ వర్షాల వల్ల కలిగిన ఆస్తి, పంట నష్టాలతోపాటు యూరియా కొరత సమస్యపై భట్టి, తుమ్మల కేంద్ర మంత్రులను కలిసి నివేదిక సమర్పించనున్నారు. ఆస్తి, పంట నష్టాలకు కేంద్ర సాయం అందించాలని, యూరియా కొరత సమస్యను పరిష్కరించాలని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌ను, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసి వారు కోరనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ పర్యటనను విజయవంతం చేసే కార్యక్రమాన్ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

 

Exit mobile version