Indiramma Saree: ఇందిరమ్మ చీరల పంపిణీ షురూ.. మీకు ఎప్పుడు వస్తాయి..? రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
CM Revanth Reddy : సీఎం రేవంత్ పలువురు మహిళలకు చీరలు పంపిణీ చేసి.. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబించారు.
- Harishth Thanniru
- Published On : November 19, 2025 / 02:44 PM IST
CM Revanth Reddy
Revanth Reddy : ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ పలువురు మహిళలకు చీరలు పంపిణీ చేసి.. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో 65లక్షల మంది మహిళలకు, మున్సిపాలిటీల్లో 35లక్షల మంది మహిళలకు చీరలను పంపిణీ చేస్తామని వివరించారు. మహిళలకు చీరలు పంపిణీ చేసి, వారి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. దీని ద్వారా భవిష్యత్తులో సంక్షేమ పథకాలు వర్తిస్తాయని వివరించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇప్పటికే ఆమేరకు అనేక పథకాలు అమల్లోకి తీసుకురావడం జరిగిందని, రానున్న రోజుల్లో మరిన్ని పథకాలను అమల్లోకి తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిన సమయంలో ఇందిరా గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎంతో కృషి చేశారు. బ్యాంకుల జాతీయకరణ, అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి పేదలకు భూములు పంచినా, పేదలకు ఇండ్లు కట్టించినా అది ఇందిరమ్మకే సాధ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పాకిస్థాన్ తో యుద్ధం సమయంలో ధీటుగా నిలబడి ఎదుర్కొన్న ధీశాలి ఇందిరమ్మ. దేశానికి బలమైన నాయకత్వం అందించిన ఘనత ఆమెదే. ఇందిరమ్మ స్ఫూర్తితో మా ప్రభుత్వం ముందుకు వెళుతోందని రేవంత్ పేర్కొన్నారు. మహిళలకు పెట్రోల్ బంక్ లు నిర్వహించుకునేలా ప్రోత్సహించాం. ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలను యజమానులను చేశాం. మహిళల సంక్షేమంతో పాటు ఆర్థిక ఉన్నతి కలిగించే కార్యక్రమాలు చేపట్టాం. ఆడబిడ్డల పేరుతోనే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నాం. రాజకీయాల్లోనూ మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించాం. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులని చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారె పెట్టి గౌరవించాలని భావించాం. అందుకే కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఇందిరమ్మ జయంతి రోజున ప్రారంభించిన ఈ కార్యక్రమం డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తాం. మార్చి 1 నుంచి 8 న మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తామని చెప్పారు.
ఎవరూ ఆందోళన చెందొద్దు.. ప్రతీ ఆడబిడ్డకు చీరను అందిస్తాం. మొదటి విడతలో 65 లక్షల చీరలు పంపిణీ చేయబోతున్నాం. చీరల ఉత్పత్తికి సమయం పడుతున్న నేపథ్యంలో రెండు విడతలుగా చీరలను పంపిణీ చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. ఇందిరమ్మ చీర కట్టుకోవాలని, మీరే బ్రాండ్ అంబాసిడర్ గా మారి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటాలని అన్నారు.
