CM Revanth Reddy
Cm Revanth Reddy : మూసీ నిర్వాసితుల విషయంలో రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది రేవంత్ ప్రభుత్వం. సెర్ప్ సీఈవో దివ్య దేవ రాజన్ ఛైర్మన్ గా ఈ కమిటీని నియమించింది. 14మంది సభ్యులతో ఈ ప్రత్యేక కమిటీ పని చేయనుంది. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నిర్వాసితుల జీవనోపాధి కోసం ఈ కమిటీ పని చేయనుంది.
ఈ ఉదయం కాకా జయంతి వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ బఫర్ జోన్ ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్న సమయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు నిర్వాసితులను ఆయుధంగా చేసుకుని ప్రజలను రెచ్చగొడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. ఈ క్రమంలో మూసీ నిర్వాసితుల కోసం ఏం చేయాలి, ఎలా చేసి వాళ్లను బాగు చేద్దాం, రండి చర్చించుకుందాం అని చెప్పి సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలోనే 14 మందితో ఈ ప్రత్యేక కమిటీని వేయడం జరిగింది. సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్, స్కూల్ ఎడ్యుకేషన్ ఇలా 14 డిపార్ట్ మెంట్లకు సంబంధించిన అధికారులు ఈ కమిటీలో మెంబర్లుగా ఉంటారు. సెర్ప్ సీఈవో దీనికి ఛైర్మన్ గా ఉంటారు. ఈ ప్రత్యేక కమిటీ మూసీ బాధితులకు సంబంధించి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎక్కడ ఇవ్వాలి? ప్రస్తుతం ఉన్న చోటు నుంచి వారిని తరలించినట్లైతే.. తక్షణం వారి జవనోపాధికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది? ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా, శాస్త్రీయంగా అధ్యయనం చేసే విధంగా ఈ ప్రత్యేక కమిటీ పని చేస్తుంది. మూసీ నిర్వాసితుల బాగు కోసం ప్రధానంగా ఈ కమిటీ పని చేయబోతోంది.
కాగా.. మూసీ నిర్వాసితుల గురించి, వారి జీవనోపాధి గురించి, వారి జీవితాలు బాగు చేసే అంశంపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ”బతకలేని పరిస్థితుల్లో వాళ్లు అక్కడున్నారు. వారిని ఎలా బతికించుకుందామో చెప్పండి. ముఖ్యమైన వాళ్లని పిలిపించి చర్చలు ప్రారంభించాలని మంత్రులు భట్టి, పొన్నంను కోరా. వాళ్ల సూచనలు తప్పకుండా స్వీకరిద్దాం. ఈ పేదలను ఎలా ఆదుకుందామో చెబుదాం. హైదరాబాద్ నగరానికి వలస వచ్చి.. ఉద్యోగ, ఉపాధి దొరక్క మూసీలో కలుషితమైన వాతావరణంలో బతుకుతున్న వారికి ఒక మంచి జీవితాన్ని ఇచ్చేలా, వారికి మంచి వసతులు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తే, ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది. బీఆర్ఎస్ నేతలు దోపిడీ చేసిన దాంట్లో ఒక పది పర్సెంట్ పెడితే వాళ్ల జీవితాలు బాగుపడతాయి. బీఆర్ఎస్ పార్టీ బ్యాంకులో రూ.1500 కోట్లు ఉన్నాయి. అందులో రూ.500 కోట్లు ఇవ్వండి. తలా ఇంత పంచి పెడదాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read : హైదరాబాద్‌లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు..! అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నిర్మాణానికి ప్రభుత్వం రెడీ..