CM Revanth Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి తొలి పర్యటనకు ఇంద్రవెల్లి వేదిక కానుంది. రాజకీయంగా తనకు కలిసొచ్చిన ఇంద్రవెల్లి నుంచి… సీఎం రేవంత్ రేపు పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఆరు గ్యారంటీల్లో భాగమైన మరో రెండు గ్యారంటీలను ఆదివాసీ గడ్డపై నుంచి అమలు చేయబోతున్నారు.
ఆదివాసీల పోరుగడ్డ ఇంద్రవెల్లి సీఎం పర్యటనకు వేదిక కానుంది. పొలిటికల్ సెంటిమెంట్‌గా రేవంత్ కొమురం భీం జిల్లాను తన తొలి పర్యటన కోసం ఎంచుకున్నారు. గతంలో పీసీసీ హోదాలో మొదటిసారి ఇంద్రవెల్లి దళిత గిరిజనుల ఆత్మగౌరవ సభలో పాల్గొన్న రేవంత్… అదే సెంటిమెంట్‌తో ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఇంద్రవెల్లి గడ్డపై అడుగుపెడుతున్నారు.
పర్యటనలో భాగంగా రేపు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం ఆసిఫాబాద్‌కు బయల్దేరతారు. మొదట కేస్లాపూర్‌లో నాగోబా దేవతను దర్శించుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత ఇంద్రవెల్లికి చేరుకుంటారు. అక్కడ కొమురం భీం స్మృతి వనానికి శంకుస్థాపన చేసి… పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
భారీ బహిరంగ సభ
ఇంద్రవెల్లి వేదికగా తెలంగాణ పునర్ నిర్మాణ సభ పేరుతో జరగనున్న భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు. అక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆరుగ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలను ఆదివాసీ గడ్డపై ప్రారంభించనున్నారు సీఎం. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్‌ను అమలు చేస్తున్న ప్రభుత్వం…. ఇందులో భాగమైన 5 వందలకు గ్యాస్ సిలిండర్ పథకానికి శ్రీకారం చుట్టనుంది. గృహజ్యోతిలో భాగమైన 2 వందల యునిట్ల ఉచిత విద్యుత్ గ్యారంటీని సీఎం ప్రారంభిస్తారు.
సీఎం పర్యటన సందర్భంగా అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన పర్యటించే ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నాగోబా ఆలయం, సభా ప్రాంగణం వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయనున్నారు. సభా చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించగా… ఒకరోజు ముందు నుంచే ఆంక్షలు కొనసాగుతున్నాయి. తెలంగాణ పునర్నిర్మాణ సభ సక్సెస్ కోసం కాంగ్రెస్ నేతలు ఉమ్మడి జిల్లా నుంచి పెద్దఎత్తున జన సమీకరణ చేస్తున్నారు.
మరోవైపు పోడు భూములకు పట్టాలు, ఐటీడీఏ ప్రక్షాళన, ఏజెన్సీ ప్రాంతంలో సమస్యలపై సీఎం స్పందిస్తారని జిల్లా వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాన్ ఏజెన్సీ ఏరియాతో పాటు ఉమ్మడి జిల్లాకి వరాలు ఇస్తారని భావిస్తున్నారు.
Also Read: జాగ్రత్తగా ఉండండి.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ హెచ్చరిక