CM Revanth Reddy : నల్లమలకు వెళ్లి అలా చేయండి.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సూచన.. కేటీఆర్‌పై కీలక కామెంట్స్..

CM Revanth Reddy : సనత్‌నగర్‌లో మర్రి చెన్నారెడ్డి టీమ్స్ ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.

CM Revanth Reddy

CM Revanth Reddy : ప్రజా పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పేదల ఆరోగ్యాన్ని ప్రభుత్వం తన బాధ్యతగా భావిస్తోందని తెలిపారు. వైద్యం కోసం ప్రజలు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకుండా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. సనత్‌నగర్‌లో మర్రి చెన్నారెడ్డి టీమ్స్ ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు.

Also Read : Telangana : తెలంగాణలో సర్ ముసాయిదా విడుదల.. డేంజర్‌లో 92లక్షల మంది ఓట్లు.. మీ పేరు ఉందో ఇలా చెక్ చేసుకోండి..

పేదలు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకునే క్రమంలో ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని, చివరకు కొందరు కిడ్నీలు కూడా అమ్ముకునే దుస్థితి ఏర్పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజాప్రభుత్వం వైద్య రంగం కోసం రూ.5,626 కోట్లు ఖర్చు చేసిందని, ఆయా విభాగాల ద్వారా మొత్తం రూ.21,800 కోట్ల మేర నిధులు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.

ఉస్మానియా ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరుకున్నా, గత పదేళ్లు అధికారంలో ఉన్నవారు ప్రత్యామ్నాయంగా మరో ఆసుపత్రి నిర్మించాలనే ఆలోచన చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎల్బీనగర్, అల్వాల్, సనత్‌నగర్ ప్రాంతాల్లో టిమ్స్ ఆసుపత్రులకు గత ప్రభుత్వం శంకుస్థాపనలు చేసినా, నిధులు కేటాయించి నిర్మాణాలను పూర్తి చేయలేదని ఆరోపించారు. 2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్ ఆస్పత్రులను పూర్తి చేస్తామని, ప్రతి ఆరు నెలలకు ఒక కొత్త ఆసుపత్రిని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దడంతో పాటు పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. వైద్యులు అవసరమైతే అదనపు సమయం పనిచేసేలా ప్రోత్సాహకాలు అందించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు.

మాజీ మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మీ నాయన ఫామ్‌హౌస్‌లు, నువ్వు, మీ చెల్లి, మీ బావ ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు.. మరి మా పేదలకు ఒక్క ఆసుపత్రి కూడా కట్టలేకపోయారంటూ మండిపడ్డారు. కరువు రావాలని అఘోర పూజలు చేయడం మానుకోవాలని, నల్లమల వెళ్లి పూజలు చేయడంతో పాటు గతంలో దోచుకున్న నిధుల్లో ఆ ప్రాంతాల్లో నియోజకవర్గానికి రూ.10కోట్లు చొప్పున ఖర్చు చేస్తే కొంతైనా పాపం తగ్గుతుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.