వారికి లక్ష రూపాయలు..!- సీఎం రేవంత్ కీలక ప్రకటన

గతంలో ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆందోళనలు చేసేవారు. ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయాలని కొందరు ధర్నాలు చేస్తున్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి లబ్ది పొందాలని కొందరు కుట్ర చేస్తున్నారు.

Rajiv Gandhi Civils Abhayahastam Scheme : సచివాలయంలో సివిల్స్ అభ్యర్థులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు. ఇక, సివిల్స్ మెయిన్స్ లో అర్హత పొందిన వారికి లక్ష రూపాయల ఆర్థిక సహకారం అందిస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రకటించారు. నిరుద్యోగం, విద్యార్థుల ఉద్యమంతోనే తెలంగాణ వచ్చిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. ఏళ్ల తరబడి వాయిదాలు పడుతున్న 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తామన్న సీఎం రేవంత్.. యూనివర్సిటీల్లో నాణ్యమైన బోధన అందేలా చర్యలు చేపడతామన్నారు.

”దేశ నిర్మాణంలో తెలంగాణ యువత ఉండాలన్నది ప్రభుత్వం ఆలోచన. మీకు నమ్మకం కలిగించేందుకే రాజీవ్ సివిల్స్ అభయహస్తం. సచివాలయం మనది అనే నమ్మకం కలిగించేందుకే రాజీవ్ సివిల్స్ అభయహస్తం. మీరు మెయిన్స్ లో కూడా ఎంపికై రాష్ట్ర ప్రతిష్ట పెంచాలి. మెయిన్స్ లో ఉత్తీర్ణులైతే కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం మీది. పరీక్షపైనే దృష్టి పెట్టండి.

విద్య.. సర్టిఫికెట్ కోసం కావొద్దు. స్కిల్స్ ఉండాలి. అందుకే స్కిల్ యూనివర్సిటీ. ఐఐటీ మోడల్ లో స్కిల్ యూనివర్సిటీ ఉంటుంది. ఒలంపిక్స్ లో మన దేశానికి పతకాలు సాధించలేకపోతున్నాం. స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతుంది. 2028 ఒలంపిక్స్ లో ఎక్కువ పతకాలు సాధించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నాం. దీని కోసం 5 వేల కోట్లు కేటాయించాం. గత ప్రభుత్వం చదువును కొనే పరిస్థితి తెచ్చింది. అన్ని యూనివర్సిటీలకు త్వరలోనే వీసీలను నియమించబోతున్నాం.

గతంలో ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆందోళనలు చేసేవారు. ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయాలని కొందరు ధర్నాలు చేస్తున్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి లబ్ది పొందాలని కొందరు కుట్ర చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మీరు చెప్పేది వినేందుకు సిద్ధంగా ఉంది. నిరసనలు అవసరం లేదు. విద్యార్థులారా.. కొందరి కుట్రలో భాగం కాకండి. ఉద్యమం ముసుగులో ఫామ్ హౌస్ లు, బంగ్లాలు, మీడియా హౌస్ వచ్చింది. అందరికీ తెలుసు. మీ అన్నగా, సీఎంగా మీకు అండగా ఉంటా. ఈ ప్రభుత్వం మీది. లక్ష్యం సాధించడంపై దృష్టి పెట్టండి. ఐఏఎస్ లుగా రావాలని కోరుకుంటున్నా” అని సీఎం రేవంత్ అన్నారు.

Also Read : తెలంగాణలో రూట్ మార్చిన కాంగ్రెస్ పార్టీ సర్కారు.. గులాబీ నేతలకు కొత్త టెన్షన్!

తెలంగాణ నుంచి యూపీఎస్సీ ప్రిలిమ్స్ కు ఉత్తీర్ణులై మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం వర్తిస్తుంది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం స్కీమ్ కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది ప్రభుత్వం. సింగరేణి కంపెనీ ద్వారా సివిల్స్ అభ్యర్థులకు ఈ ఆర్థిక సాయం చేస్తారు.

 

ట్రెండింగ్ వార్తలు