Cm Revanth Reddy : భవిష్యత్తులో తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో మార్పులు చేస్తే చట్టపరంగా చర్యలు..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం

తెలంగాణ వచ్చాక ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్ నెరవేర్చలేదు. ఉద్యమ సమయంలో యువత గుండెలపై టీజీ అని పచ్చబొట్లు వేసుకున్నారు.

Cm Revanth Reddy : తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ప్రజలు, కవులు, కళాకారులను ఉద్దేశించి మాట్లాడారు. 4 కోట్ల ప్రజల తల్లి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపం తెలంగాణ తల్లి అని అభివర్ణించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకున్నామన్నారు. తెలంగాణ తల్లి రూపం అద్భుతంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

‘సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిని అవమానించారు. తెలంగాణ వచ్చాక ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్ నెరవేర్చలేదు. ఉద్యమ సమయంలో యువత గుండెలపై టీజీ అని పచ్చబొట్లు వేసుకున్నారు. కానీ బీఆర్ఎస్ సర్కార్ టీజీని టీఎస్ గా మార్చింది. జయజయహే అనే గీతాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ప్రజా ప్రభుత్వంలో జయజయహే గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చాం. పదేళ్ల పాటు తెలంగాణ తల్లి వివక్షకు గురైంది. తెలంగాణ తల్లి అవతరణను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం. తెలంగాణ తల్లి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

భవిష్యత్ లో తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో మార్పులు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం నిర్ణయించింది. రాజకీయ విమర్శలకు తావు లేకుండా ఉత్సవాలు నిర్వహిస్తాం. ఒక వ్యక్తి కోసమో, కుటుంబం కోసమో తెలంగాణను తెచ్చుకోలేదు. 4 కోట్ల మంది ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. అగాథం నుంచి అభివృద్ది వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తాం. గతంలో వివక్షకు గురైన కవులు, కళాకారులకు తగిన గౌరవం కల్పిస్తాం’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

 

 

Also Read : ఉద్యమ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చేశారు- సీఎం రేవంత్ పై ఎమ్మెల్సీ కవిత ఫైర్