CM Revanth Reddy : 2014 నుంచి ఉన్న రాజ్యాంగం, చట్టాలే ఇప్పుడూ ఉన్నాయి.. అప్పుడు లేని అనర్హత, వేటు ఇప్పుడెలా?- సీఎం రేవంత్ రెడ్డి

అప్పుడు ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకే తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు.

Cm Revanth Reddy : ఎమ్మెల్యేల ఫిరాయింపులు, అనర్హత వేటు, ఉప ఎన్నికల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయం, ఉప ఎన్నికలు రావటం ఖాయం అంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను సీఎం రేవంత్ కొట్టిపారేశారు. 2014 నుంచి 2024 వరకు ఉన్న రాజ్యాంగం, చట్టాలే ఇప్పుడూ ఉన్నాయని ఆయన అన్నారు.

అప్పుడు ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకే తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. అప్పుడు జరగని ఉప ఎన్నికలు, అప్పుడు జరగని అనర్హత వేటు ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి వస్తుంది? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వస్తాయంటూ కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదం అన్నారు రేవంత్ రెడ్డి.

Also Read : ఢిల్లీలో కొత్త సీన్.. ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి.. త్వరగా కంప్లీట్ చేయాలంటూ సీఎం రేవంత్ కు ప్రధాని మోదీ నివేదిక..

కేసీఆర్ కు కిషన్ రెడ్డి పార్టనర్..!
అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపైనా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్టనర్ అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పని చేస్తున్నారని అన్నారు. మెట్రో విస్తరణలో నాకు పేరు వస్తుందని, కేసీఆర్ హయాంలో ఇది జరగలేదు కాబట్టి నా హయాంలో జరగొద్దని కిషన్ రెడ్డి భావిస్తున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. అందుకే కిషన్ రెడ్డి మెట్రో విస్తరణ ప్రాజెక్టును క్యాబినెట్ లో అడ్డుకుంటున్నారని కామెంట్ చేశారు.

ఇక తెలంగాణకు వస్తున్న ఆదాయం, ఖర్చులు, అప్పులపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకి ప్రస్తుతం నెలకు 18,500 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. ఉద్యోగుల జీతాలకు, అప్పుల వడ్డీలకు 13 వేల కోట్ల రూపాయల ఖర్చవుతుందని తెలిపారు. మిగిలిన 5000 కోట్లతోనే సంక్షేమం, అభివృద్ధి పనులను కొనసాగించాల్సి వస్తోందన్నారు.

ఆదాయాన్ని 22 వేల కోట్లకు తీసుకెళ్తే అన్నీ సజావుగా..
ఆదాయాన్ని 22 వేల కోట్లకు తీసుకెళ్తే అన్నీ సజావుగా ముందుకు తీసుకెళ్లేందుకు వీలుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. తెలంగాణ జీఎస్టీ ఆదాయంలో రికార్డ్ స్థాయిలో పెరుగుదల ఉందని తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగ రేటు కూడా తగ్గుతోందన్నారు.

Also Read : రంగంలోకి కేంద్రం.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఈ రూల్స్ మస్ట్ గా పాటించాలి

మంత్రులకు వారి వారి శాఖల్లో పని చేసేందుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని తెలిపారు. పెండింగ్ లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం.. పాలన, పనిపైనే దృష్టి పెట్టింది.. ప్రచారంపైన కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.