Cm Revanth: హాలీవుడ్ వసూళ్లతో పోటీపడేలా తెలుగు సినిమా ఎదగాలి- సీఎం రేవంత్ రెడ్డి

నేను కృష్ణ అభిమానిని. లారీ ఎక్కి వనపర్తికి వెళ్లి నేను సినిమా చేసే వాడిని. కృష్ణ ఏడాదికి 15 సినిమాలు చేసేవారు. ఇప్పుడు..

  • Published On : March 13, 2026 / 12:56 AM IST

Representative Image (Image Credit To Original Source)

Cm Revanth: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ హైదరాబాద్ కోకాపేటలో అత్యంత విలాసవంతంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్‌’ (Allu Cinemas) మల్టీప్లెక్స్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. తెలుగు సినిమా హాలీవుడ్ స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం ఉంటుందని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

కృష్ణ ఏడాదికి 15 సినిమాలు చేసేవారు.. ఇప్పుడు..

”దేశంలో సినిమాకు గొప్ప పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అల్లు కుటుంబాన్ని అభినందిస్తున్నా. నేను సినిమా అభిమానిని. సినిమా సాంకేతికంగా వేగంగా ముందుకెళ్తుంది. ప్రేక్షకులని కట్టిపడేసే సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి. బాహుబలి, కల్కి, అరుంధతి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు అత్యున్నత సాంకేతిక విలువలతో వచ్చాయి. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు తెలుగు సినిమాను హైదరాబాద్ తీసుకొచ్చారు. కృష్ణ సినిమాలో అడ్వెంచర్స్ చేశారు. నేను కృష్ణ అభిమానిని. లారీ ఎక్కి వనపర్తికి వెళ్లి నేను సినిమా చేసే వాడిని. కృష్ణ ఏడాదికి 15 సినిమాలు చేసేవారు. ఇప్పుడు ఐదారేళ్లుకు ఒక సినిమా చేస్తున్నారు.

సినిమా సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. సినిమాను పరిశ్రమగా గుర్తించి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. IT, ఫార్మాతో పాటు సినిమా పరిశ్రమ గొప్ప స్థాయికి తీసుకెళ్తాం. తెలుగు సినిమాకు కోలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్ పోటీ కాదు. హాలీవుడ్ సినిమాలు ఇక్కడ చిత్రీకరించాలి. కృష్ణానగర్ నుంచి గొప్ప సినిమాలు తీసే అనేకమంది సాంకేతిక నిపుణులు, కళాకారులు వస్తున్నారు. సినీ పరిశ్రమకు మా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. మన సినిమాలు హాలీ వుడ్ కి వెళ్ళాలి. భాష అడ్డంకి కాదు ఇప్పుడు. టాలెంట్ మాత్రమే ఇప్పుడు కనిపిస్తుంది” అని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.

అల్లు సినిమాస్ నగరానికి, దేశానికి గుర్తింపు తీసుకురావాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. అల్లు అర్జున్ పాన్ ఇండియాలోనే కాదు, భవిష్యత్తులో హాలీవుడ్‌లో కూడా రాణించాలన్నారు. హాలీవుడ్ వసూళ్లతో పోటీపడేలా తెలుగు సినిమా ఎదగాలని.. అవతార్, జురాసిక్ పార్క్ లాంటి చిత్రాలను మనమూ తీయాలని రేవంత్ అన్నారు. సినిమాలకు నేడు భాషా సరిహద్దులు చెరిగిపోయాయని, సినీ రంగానికి ప్రతిభావంతులే కావాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.