CM Revanth Reddy : వర్షాలు తగ్గాయి.. వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరిగింది.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి

CM Revanth Reddy : ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనడంలో కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు.

CM Revanth Reddy

CM Revanth Reddy : ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనడంలో కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. దక్షిణ రాష్ట్రాల వ్యవసాయ సదస్సులో పాల్గొనడానికి శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర మంత్రికి వివరించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైన సహకారం అందించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.

Also Read : Telangana Congress : ఆ లక్కీ పోస్టుకోసం కాంగ్రెస్‌లో పోటాపోటీ.. రేసులో కీలక నేతలు.. అనుచరుల కోసం ముఖ్యనేతల లాబీయింగ్.!

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని తెలిపారు. అలాగే, తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని వివరించారు.
ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పంటల మార్పిడిపై రైతులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించి రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలన్న ఆలోచనతో 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పండ్లు, కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు.

PMAY G పథకంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రానికి రెండు లక్షల ఇండ్లను కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తూ అందుకు కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్రంలో 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయాలని గత జూలైలో కేంద్రమంత్రికి ఢిల్లీలో వినతిపత్రం అందించిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో డిమాండ్‌కు అనుగుణంగా మిగిలిన 9.56 లక్షల ఇండ్లను కేటాయించాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రిని కోరారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని అందిస్తున్నామని, అలాగే సన్న వడ్లకు రూ. 500 బోనస్‌ను అందించి ప్రోత్సహిస్తున్నామని వివరించారు.