CM Revanth Reddy : ఉగాది వేడుకల్లో ‘రైతు భరోసా’పై కీలక విషయాన్ని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. మా లక్ష్యం అదే..

CM Revanth Reddy : ఉగాది పర్వదినం సందర్భంగా రవీంధ్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు.

CM Revanth Reddy

  • రవీంధ్రభారతిలో ఉగాది వేడుకలు
  • హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి
  • రైతు భరోసాపై కీలక విషయాన్ని చెప్పిన రేవంత్

CM Revanth Reddy : రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని.. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా రవీంధ్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. ఈ ఉగాది వేడుకల్లో బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

Also Read : Ugadi Panchangam Gold Rate : ఈ ఏడాది బంగారం రేట్లు పెరుగుతాయా? తగ్గుతాయా..? ఉగాది పంచాంగ శ్రవణంలో ఏం చెప్పారంటే..

ఈ నూతన సంవత్సరం రైతు నామ సంవత్సరం. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ అందిస్తున్నాం. దేశంలోనే రైతుల విషయంలో అతి తక్కువ రుణభారం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించడం మనకు గర్వకారణమని సీఎం పేర్కొన్నారు.

తెలంగాణలో 70శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్నాయి. అందుకే రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేశాం. పంటల సాగు సమయంలో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద ఇప్పటికే 18వేల కోట్లు ఖర్చు చేశాం. ఈనెల 22న మరోసారి రైతు భరోసా నిధులను విడుదల చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

రైతు సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత ప్రభుత్వం హయాంలో భూములను దోచుకునేందుకు తీసుకొచ్చిన ధరణి భూతాన్ని తరిమేసి భూ భారతితో భూసమస్యలను పరిష్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. ప్రకృతి వైపరిత్యాలు రాకుండా ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతులు ఆత్మగౌరవంతో బతికేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు.