Telangana CM Revanth Reddy
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతోంది. గతేడాది డిసెంబర్ 7న రేవంత్ సర్కార్ కొలుదీరింది. ఆరు గ్యారెంటీలు, సంక్షేమ-అభివృద్ది హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ శక్తిమేరకు పాలన సాగించింది. ఓ వైపు గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే సాధ్యమైనంత వరకు ఆరు గ్యారెంటీల్లో చాలా వరకు అమలు చేస్తూ ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజా విజయోత్సవాలను జరుపుతోంది ప్రభుత్వం. సేమ్‌టైమ్ వన్ ఇయర్ ప్రొగ్రెస్ రిపోర్ట్‌పై రేవంత్ ఆరా తీస్తున్నారట. ప్రభుత్వ పనితీరు మీద సమీక్ష చేసుకుంటున్నారట.
ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారని ఆరా తీస్తున్నారట రేవంత్. 80 శాతం హామీలను నెరవేర్చామని భావిస్తున్నారట. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 10 లక్షల ఆరోగ్యశ్రీ హామీలను ఇప్పటికే నెరవేర్చామంటున్నారు. 2 లక్షల రుణమాఫీ చేసేశామని చెప్తున్నారు.
త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తామని..సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారట. ఇప్పటికే 50 వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేశామని లెక్కలు చెప్తున్నారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా సాధ్యమైనంత వరకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసుకుంటూ వస్తున్నామనే అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది.
ఇంటెలిజెన్స్ వర్గాలతో రిపోర్ట్..!
ఏడాది పాలనపై జనం ఏమనుకుంటున్నారని జిల్లాల వారీగా ఇంటెలిజెన్స్ వర్గాలతో రిపోర్ట్ తెప్పించుకుంటున్నారట. కాంగ్రెస్ నేతలు, సన్నిహితులను కూడా అడిగి తెలుసుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సానుకూలతే ఉన్నా..ప్రధానమైన హామీల అమలు విషయంలో కొంత అసంతృప్తి ఉందన్న ఫీడ్ బ్యాక్ వచ్చిందట.
అందులో రైతు భరోసా, మహిళలకు నెలకు 2,500 సాయం అమలు చేయకపోవడంతో ప్రతికూలత ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట. ఇక సీఎంగా రేవంత్ రెడ్డి దూకుడుగా పనిచేస్తున్నా..కొందరు మంత్రులు ఆ స్పీడ్‌ను అందుకోలేకపోతున్నారని జనం చెబుతున్నారట. మరీ ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు పనిచేయడం లేదన్న ఫీడ్ బ్యాక్ వచ్చిందని తెలుస్తోంది.
రాష్ట్రంలో ఏడాది పాలనపై జనం నుంచి వస్తున్న సానుకూల స్పందనతో సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక రెండో ఏడాది నుంచి పాలనలో స్పీడ్ పెంచాలని భావిస్తున్నారట. సాధ్యమైనంత త్వరగా ఇంకా అమలు కాని పథకాలను ప్రారంభించాలని సీఎం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు కావాల్సిన నిధులపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టారట.
ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్లేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇకపై జెట్ స్పీడ్‌తో పాలనను పరుగులు పెట్టించేలా పక్కా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారట. ఇంతలో మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తైతే మరింతగా అన్నిశాఖలపై దృష్టి పెట్టొచ్చన్న క్లారిటీతో ముఖ్యమంత్రి ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.