CM Revanth Reddy: భారీ వర్షాలు.. అస్తి, ప్రాణ నష్టం జరిగింది: రేవంత్ రెడ్డి

వ్యాధులు వేగంగా విస్తరించే అవకాశం ఉందని, ఫాగింగ్, బ్లీచింగ్..

Telangana CM Revanth Reddy

తెలంగాణలో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి వివరాలు తెలిపారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో అస్తి, ప్రాణ, ప్రభుత్వ ఆస్తులు, విద్యుత్, రోడ్లు, సబ్ స్టేషన్ల నష్టం జరిగిందని చెప్పారు.

మూడు రోజులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా అన్ని శాఖల మంత్రులు ప్రజల్లోనే ఉంటూ సహాయం చేసి భరోసా ఇస్తున్నారని తెలిపారు. 48 గంటల పాటు అధికార యంత్రాంగం నిర్విరామంగా పనిచేస్తోందని చెప్పారు. 16 మంది ప్రాణాలు కోల్పోయామని చెప్పారు. సూర్యపేటలో ప్రజల కష్టాలు పరిశీలించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

వ్యాధులు వేగంగా విస్తరించే అవకాశం ఉందని, ఫాగింగ్, బ్లీచింగ్ చేయాలని సిబ్బందికి చెప్పామని తెలిపారు. విపత్తు వచ్చిన ప్పుడు ప్రధానమంత్రి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఖమ్మం, పాలేరు, మధిరలో గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రకృతి విపత్తు సంభవించిందని తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తాను లేఖ రాసి, జాతీయ విపత్తుగా గుర్తించాలని చెప్పానని తెలిపారు. 4-5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, అర్బన్, రూరల్ ఏరియాలో రూ.5,438 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నుండి అదుకోవాలని, ప్రధాన మంత్రి పెద్దన్న పాత్ర పోషించాలని అన్నారు.

తాము ఖర్చులకు వెనకడుగు వేయబోమని, ఇది ప్రజల ప్రభుత్వమని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి ఎకరాకు పది వేల నష్ట పరిహారం ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ప్రజల కోసం ఖమ్మం కలెక్టర్‌కి 5 కోట్ల రూపాయల కేటాయింపు, సూర్యపేట, కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల కలెక్టర్లకు 5 కోట్ల రూపాయల చొప్పున కేటాయింపులు చేశామని అన్నారు.

ఎన్డీఆర్ఎఫ్ బృందం లాగానే తెలంగాణలో డీజీఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటు చేయాలని 8 యూనిట్లలో 8 ప్రాంతాలలో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం విధి విధానాలు చేయలేక పోయిందని చెప్పారు. విధానపరమైన నిర్ణయాలను అన్ని శాఖల సమన్వయంతో చేస్తున్నామని అన్నారు. హైడ్రా కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.

Also Read: 74 ఏళ్లు ఉన్నప్పటికీ చంద్రబాబు బయట తిరుగుతుంటే.. 54 ఏళ్ల మన సీఎం రేవంత్ మాత్రం..: హరీశ్ రావు

ట్రెండింగ్ వార్తలు