CM Revanth Reddy: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నది మా కమిట్మెంట్. రిజర్వేషన్ల సాధనకోసం మేము పూర్తిస్థాయిలో మా ప్రయత్నాలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు.
కులగణన, బీసీ రిజర్వేషన్ల సాధనలో మా చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరు. రాష్ట్ర ప్రభుత్వంగా అన్ని విధాల ప్రక్రియ పూర్తి చేశాం. ప్రస్తుతం కేంద్రం పరిధిలో బీసీల రిజర్వేషన్ల అంశం ఉంది. కేంద్రం, బీజేపీ కోర్టులో రిజర్వేషన్ల అంశం ఉంది. బీసీలపై ప్రేమ ఉంటే బీసీ బిల్లును కేంద్రం ఆమోదించాలని రేవంత్ రెడ్డి అన్నారు.
కేంద్రంపై ఒత్తిడి పెంచడంకోసం, బీసీలకు న్యాయమైన వాటా కోసమే మా కొట్లాట. జంతర్‌మంతర్ వేదికగా మా వాణీని బలంగా వినిపించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. జంతర్‌మంతర్ ధర్నాపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శలు విడ్డూరం. మా కమిట్మెంట్‌కు వాళ్ల సర్టిఫికేట్ అవసరం లేదు. మేము ప్రజలకు అబద్ధపు మాటలు చెప్పి మభ్యపెట్టం. అది బీఆర్ఎస్ నైజం. మేము ఆ పని చేయమని రేవంత్ రెడ్డి అన్నారు.
బీసీలకు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేయడమే మా టార్గెట్. మోదీ చేతుల్లోనే బీసీ రిజర్వేషన్ల నిర్ణయం ఉంది. మా ఆఖరి పోరాటాన్ని పూర్తిచేశాం.. ఇక బీజేపీయే నిర్ణయం తీసుకోవాలని రేవంత్ అన్నారు. రాష్ట్రపతికి రాజకీయాలకు సంబంధం లేదు.
లోకల్‌బాడీ ఎన్నికలు సెప్టెంబర్ 30లోపు నిర్వహించాలని హైకోర్టు చెప్పింది. ఆలోపు బీసీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపకపోతే ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై ఆలోచన చేస్తాం. ప్రజల అభిష్టం మేరకే పార్టీ నిర్ణయం ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.