ఓ అరడజను మంది సభ్యత్వం రద్దు చేస్తే బుద్ధి వస్తుంది- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ ఫైర్

ఒక సభ్యునికి మైక్ ఇవ్వొద్దనే అధికారం బీఆర్ఎస్ సభ్యులకు ఎక్కడిది? బీఆర్ఎస్ తీరును ఓపికతో చూస్తున్నాం.

Cm Revanth Reddy : అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్. లాంగ్వేజ్ వేరు.. నాలెడ్జ్ వేరు, కేటీఆర్ ఇది తెలుసుకోవాలి. ఓ అరడజను మంది సభ్యత్వం రద్దు చేస్తే బుద్ధి వస్తుంది అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్.

”అవగాహన ఉండాలి. అవతలి వారిని అవహేళన చేస్తే సరిపోదు కేటీఆర్. దానం నాగేందర్ సభలో మాట్లాడితే తప్పేంటి? హైదరాబాద్ పై అవగాహన ఉంది కాబట్టి మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. ఇస్తే తప్పేంటి? ఒక సభ్యునికి మైక్ ఇవ్వొద్దనే అధికారం బీఆర్ఎస్ సభ్యులకు ఎక్కడిది? బీఆర్ఎస్ తీరును ఓపికతో చూస్తున్నాం. కోమటిరెడ్డి, సంపత్ ను ఈ సభలో ఏం చేశారో మేము చూడలేదా? ఓ అరడజను మంది సభ్యత్వం రద్దు చేస్తే బుద్దోస్తది.

కమిషనర్లు రోడ్డు మీద ఉండాలి. లేదంటే నేనే రోడ్డు మీదకొచ్చి ట్రాఫిక్ నియంత్రిస్తా అని చెప్పాను. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే హైడ్రా. మాకు మంచి కావాలి. దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నాం. కాళేశ్వరం కడితిరి లక్ష కోట్లు మింగితిరి. మేడిగడ్డ కూల్చితిరి. మూసీ రివర్ డెవలప్ మెంట్ కోసం గ్లోబల్ టెండర్స్ పిలిచాం. మూసీ పరివాహకంలో ఉన్న నిరుపేదలకు ఆశ్ర్రయం కల్పిస్తాం. గాడిద పని గాడిద చేయాలి. కుక్క పని కుక్క చేయాలి. మేము అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాలేదు. ఎందుకింత ఆక్రోశం? ఎల్లంపల్లి నుండి వస్తున్న గోదావరి నీళ్లకు బొక్క పెట్టి గజ్వేల్ కు తీసుకెళ్లారు. సచ్చిన పామును ఎందుకు అని నేను మాట్లాడటం లేదు.

అరడజను మందిపై వేటు వేస్తే బుద్ధి వస్తుంది. గతంలో కోమటిరెడ్డి, సంపత్ లపై చర్యలు తీసుకోలేదా? లండన్ ఐ లాంటి.. హైదరాబాద్ ఐ టవర్ ను.. మీరాలం ట్యాంక్ లో ఏర్పాటు చేస్తాం. కేసీఆర్ సెంటిమెంట్ కోసం ప్రజల సెంటిమెంట్ ను పణంగా పెట్టారు. కృష్ణా ఫేస్ 3, గోదావరి ఫేస్ 1 తెచ్చింది కాంగ్రెసే. కొందరు గోదావరి నీళ్లు నెత్తిన పోసుకుని మేమే నీళ్లు తెచ్చామని డబ్బా కొట్టారు. చంద్రబాబుకు, వైఎస్సార్ కు భిన్నాభిప్రాయాలు ఉన్నా.. హైదరాబాద్ అభివృద్ధికి వారిద్దరూ కృషి చేశారు. హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డును మణిహారంలా వైఎస్సార్ ఇచ్చారు.

ఔటర్ లోపల ఉన్న నగరాన్ని అద్భుతంగా తయారు చేసేందుకు హైడ్రాను సిద్ధం చేస్తున్నాం. హైదరాబాద్ లో రోడ్డుపై నీరు ఆగకుండా వాటర్ హార్వెస్టింగ్ లను ఏర్పాటు చేస్తాం. 141 ప్రాంతాల్లో డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బంది ఉంటారు. అఫీసులకే పరిమితమైన అధికారులతో ఫిజికల్ పోలీసింగ్ చేపిస్తున్నాం. అధికారులు రోడ్డుపైకి రాకపోతే.. నేను వస్తా అని చెప్పాను. బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే.. మా ప్రభుత్వంలో క్రైమ్ రేటు తగ్గింది.

గోషామహాల్ పోలీస్ క్వార్టర్స్ స్థలంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తాం. ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రిని హెరిటేజ్ బిల్డింగ్ గా ఉంచుతాం. కొత్త ఉస్మానియా బిల్డింగ్ ను 30 ఎకరాల స్థలంలో నిర్మిస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Also Read : కవిత వల్లే ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్‌ని వీడారా? అసలేం జరిగింది..

 

 

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ”కిషన్ రెడ్డికి మంత్రి పదవి వచ్చినందుకు సంతోషంగా ఉంది. కిషన్ రెడ్డికి రెండు సార్లు ఫోన్ చేశాను. బండి సంజయ్ ను కూడా తీసుకొని సెక్రటేరియట్ కు రండి అని చెప్పా. అభివృద్ధిపై చర్చిద్దాం అని చెప్పా. కానీ ఎందుకో రాలేదు. ఇప్పటికైనా బీజేపీ ఎమ్మెల్యేలను కోరుతున్నా. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరినీ తీసుకుని సెక్రటేరియట్ కు రండి. మా మంత్రులను కూడా పిలుస్తా. అందరం కలిసి అభివృద్ధిపై చర్చిద్దాం. ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేదవాడు, ప్రజల మనిషి. ఆయనను కాపాడుకోవాలి. సిర్పూర్ కాగాజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారు. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిలు ఆర్థికంగా బాగా ఉన్నోళ్లు” అని సీఎం రేవంత్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు