కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగింది- సీఎం రేవంత్ రెడ్డి

పదేళ్లు సీఎంగా ఉన్నా పాలమూరు ప్రాంతానికి కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు.

CM Revanth Reddy : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. ఎక్కడి నుంచో వలస వచ్చిన కేసీఆర్ ను ఎంపీ చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు సీఎంగా ఉన్నా పాలమూరు ప్రాంతానికి కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ క్షమాపణ చెప్పిన తర్వాతే మళ్లీ ఈ గడ్డపై అడుగు పెట్టాలన్నారు సీఎం రేవంత్. పాలమూరు ప్రజలు ఛీకొట్టినా కేసీఆర్ కు సిగ్గు రాలేదన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొడంగల్ లో భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఇతడే- సీఎం రేవంత్ రెడ్డి
మరోవైపు కోస్గి సభలో కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి తొలి అభ్యర్థి పేరుని ప్రకటించారాయన. మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీ చంద్ రెడ్డిని ప్రకటించారు రేవంత్. ఆయనను ఆశీర్వదించాలని, 50వేల మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ముఖ్యమంత్రి రేవంత్. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 14 సీట్లను గెలిపించాలని, అందుకు సిద్ధమేనా అంటూ కార్యకర్తలను ఉద్దేశించి సీఎం రేవంత్ అన్నారు.

కాగా, లోక్ సభ అభ్యర్థుల ప్రకటన విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి స్వేచ్ఛను రేవంత్ కి ఇచ్చినట్లు సమాచారం. అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 24 గంటల్లోనే తొలి అభ్యర్థి పేరు అనౌన్స్ చేశారాయన. 14 సీట్లు గెలిస్తేనే విజయం సాధించినట్టని కోస్గి సభలో సీఎం రేవంత్ అన్నారు. మిగతా పార్లమెంట్ అభ్యర్థులను కూడా మార్చి మొదటి వారంలోగా ప్రకటించనున్నారు సీఎం రేవంత్.

”పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నుంచి 50వేల మెజారిటీ ఇవ్వండి. మళ్లీ 5వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. కాంగ్రెస్ కార్యకర్తలకు నేను పిలుపునిస్తున్నా. ఇది విరామం మాత్రమే.. ఇంకా యుద్ధం ముగిసిపోలేదు.. 17 స్థానాల్లో 14 పార్లమెంటు స్థానాలు గెలిచినపుడే.. పార్లమెంటులో మనం పట్టు సాధించినపుడే యుద్ధం గెలిచినట్టు.. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Also Read : ఎమ్మెల్సీ కవితకు మరోసారి సీబీఐ నోటీసులు

 

 

ట్రెండింగ్ వార్తలు