సన్నాలకు కూడా బోనస్ ఇచ్చి రైతులను ప్రోత్సహించిన ప్రభుత్వం తమదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
“పాలమూరు బిడ్డనని చెప్పుకోవడం నాకెంతో గర్వకారణం. పాలమూరు వాసులకు పాలన చేతకాదన్నారు. ఇప్పుడు పన్నుల సేకరణలో కూడా తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. ఇప్పుడు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పేదల ఇళ్లకు వెళ్లి సన్నబియ్యం తింటున్నారు. మీరంతా సన్నబియ్యం తింటున్నారా? లేదా?” అని రేవంత్ రెడ్డి అడిగారు.
నల్లమల డిక్లరేషన్‌ను ప్రకటిస్తూ.. “ఎవరో నాయకుడు వచ్చి నల్లమలను అభివృద్ధి చేయాలని అనేవారు. ఇప్పుడు నేను సీఎంగా నల్లమల నుంచి మాట్లాడుతుంటే నా గుండె ఉప్పొంగిపోతోంది. ఒకప్పుడు నల్లమల అంటే వెనుకబడిన ప్రాంతం. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఈ ప్రాంత రుణం తీర్చుకుంటున్నాం. నల్లమల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించాలి.
నల్లమల ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని సహచర మంత్రిని కోరుతున్నా. ఒకప్పుడు పోడు భూములు పోరుభూములుగా మారాయి. దేశంలో ఎన్నో ప్రాజెక్టులను పాలమూరు బిడ్డలు కట్టారు. పాలమూరు ప్రజలు కట్టిన ప్రాజెక్టులు నేడు దేశానికి వెన్నెముకగా ఉన్నాయి” అని రేవంత్ రెడ్డి చెప్పారు.
“మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తున్నాం. అప్పట్లో ఆడబిడ్డలు వారి అమ్మగారి ఇంటికి వెళ్లాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన (భర్త) దగ్గర చెయ్యి చాపాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇంటాయన ఆఫీస్ కి పోతే అమ్మవారి దర్శనం చేసుకుని, అమ్మగారి ఇంటికి పోయి పలకరించి మళ్లీ సాయంత్రానికి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ఇంటికి వచ్చే ఏర్పాట్లను చేశాం. ఈ 16-17 నెలల్లో దాదాపుగా 5500 కోట్ల రూపాయలు ఆడబిడ్డల ఉచిత బస్సుకు మనం ఖర్చు పెట్టాం. ఇదే కాదు ఇప్పుడు సోలార్ పంపు సెట్లు పెట్టుకున్నాం. ఇక్కడ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం” అని రేవంత్ రెడ్డి చెప్పారు.