CM Revanth Reddy : కృష్ణా – గోదావరి జలాల్లో రాజీపడే ప్రసక్తే లేదు.. ఆ ప్రాజెక్టులు పూర్తిచేసి రైతుల కళ్లలో ఆనందం చూస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నివర్గాల ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy

CM Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నామని, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వం 32 నెలల కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని, తలసరి ఆదాయంలో టాప్‌లో ఉన్నామని అన్నారు. గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడకలకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరై సీఎం రేవంత్ రెడ్డి జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Also Read : Telangana Govt : రైతులకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ సర్కార్.. ఆ పథకం బంద్.. ఆందోళనలో అన్నదాతలు..

వ్యవసాయాన్ని పండుగ చేయాలని నిర్ణయించామని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతు సంక్షేమ కోసం అనేక పథకాలు చేపట్టామని, రైతు భరోసా, రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు ఇలా.. అన్ని విషయాల్లో రైతులకు అండగా నిలుస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం రికార్డులు సృష్టించిందని అన్నారు.

కృష్ణా-గోదావరి జలాల్లో రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించి తీరుతామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామన్నారు. త్వరలోనే పాలమూరు పూర్తి చేసి నీరందిస్తామని తెలిపారు.

ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపే లక్ష్యంతో ఆగస్టు 17నుంచి రాష్ట్రంలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి సోమవారం ఈ ప్రజావాణి జరుగుతుందని, త్వరలో ఆన్‌లైన్ ప్రజావాణి పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చి రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా ప్రజలు తమ అర్జీలను నమోదు చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు.

అర్జీల పరిష్కార పురోగతిని ప్రత్యేక డ్యాష్‌బోర్డ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజలకు ఇది ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంది.

రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు మౌలిక వసతులు కీలకమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ పోటీ ఇతర రాష్ట్రాలతో మాత్రమే కాకుండా ప్రపంచంతోనూ ఉండేలా ప్రపంచ స్థాయి మౌలిక వసతులను నిర్మించేందుకు కార్యాచరణ ప్రారంభించినట్లు తెలిపారు. హైదరాబాద్ చుట్టూ సుమారు 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 6,092 కిలోమీటర్ల హ్యామ్ రోడ్లు, రేడియల్ రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో రెండో దశను కూడా ముందుకు తీసుకెళ్తున్నామని, ఇందులో భాగంగా 123 కిలోమీటర్ల మేర విస్తరణకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.

అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు రావాలంటే విమానాశ్రయాలు కీలకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తున్నట్లు, ఆదిలాబాద్‌లో జాయింట్ యూజ్ ఎయిర్‌ఫీల్డ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రోడ్డు, రైలు, విమాన, లాజిస్టిక్ కనెక్టివిటీని విస్తరించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు హైడ్రాను ఏర్పాటు చేసినట్లు.. బతుకమ్మకుంట, నల్లచెరువు సహా పలు చెరువులను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ‘లేక్ ఎకానమీ’ని అభివృద్ధి చేసి మహిళా సంఘాలకు అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సబర్మతి, యమునా, గంగా రివర్‌ఫ్రంట్‌ల తరహాలో మూసీ నదిని కూడా పునరుజ్జీవింపజేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి ముందుకెళ్తుందని, మూసీ పునరుజ్జీవనంలో భాగంగా 55 కిలోమీటర్ల పరిధిలో సమగ్ర ప్రణాళికలను చేపట్టినట్లు తెలిపారు. మూసీలోకి మురుగునీరు చేరకుండా 39 కొత్త సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు.

గోదావరి నుంచి 2.55 టీఎంసీల స్వచ్ఛమైన నీటిని మూసీలోకి తరలించే ప్రణాళికలపై కూడా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో మురుగునీరు, పారిశ్రామిక కాలుష్యం, ఇతర వ్యర్థాలు మూసీ నదిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని, ఈ సమస్యను దశలవారీగా, క్రమబద్ధంగా పరిష్కరించేందుకు మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ప్రక్షాళన కార్యక్రమానికి సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు. ప్రజలకు ఎలాంటి కష్టం, నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని, అవసరమైన చోట నష్టపరిహారం అందించడంతో పాటు సౌకర్యాలు కల్పిస్తామని హామీ వచ్చారు.