తీవ్ర విమర్శలు చేసుకుంటున్న రేవంత్, కేసీఆర్.. ఆ హుందాతనమే కరువైందా?

Telangana politics: ఎవరు ఎక్కువ తిట్లు తిట్టగలం అనేదానిపై నేతలు ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు తప్ప.. ప్రజలకు మంచి చేయడానికి..

రాజకీయ నాయకులంటే సమాజంలో ఓ గౌరవం ఉంటుంది. అధికారం, ప్రతిప్రక్షం అన్న సంబంధం లేకుండా సాధారణ ప్రజలు రాజకీయ నేతలను సమాజంలో హోదా ఉన్న వ్యక్తులుగా గుర్తిస్తారు. నేతల మాట, నడత సమాజంపై పెను ప్రభావమే చూపిస్తుంది. ప్రజలు ప్రతిక్షణం వారిని గమనిస్తూ ఉంటారు. అనుచరులు వారు చెప్పినట్టు నడుచుకుంటారు.

అందుకే నేతలు మాట్లాడే మాటలు, వారి మాటతీరు ఎంత హుందాగా ఉంటే వారికీ, సమాజానికి కూడా అంతే మంచి జరుగుతుంది. వారికీ అదే రీతిలో గౌరవం లభిస్తుంది. కానీ ప్రస్తుత రాజకీయాల్లో ఆ హుందాతనమే కరువయింది. సాధారణ నేతలకే కాదు.. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్నవారి నోటికి సైతం హద్దూ అదుపూ ఉండడం లేదు. లక్షల మంది ప్రజల సమక్షంలోనే, కోట్లాది మంది తమ మాటలు వింటారన్న కనీస స్పృహ లేకుండా ఇష్టారీతిన నోటికి ఏది వస్తే అదే మాట్లాడడం ఇప్పుడు రాజకీయనాయకుల లక్షణంగా మారిపోయింది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల కాలంలో సీఎంగా కేసీఆర్ ఎన్నో సందర్భాల్లో, రాజకీయ ప్రచారాల్లో మాట్లాడారు. తెలంగాణ మాండలికలంలో అనేక రకాల పదాలను, ప్రజలకు చెడు అర్థంగా భావించే మాటలను కేసీఆర్ ఆయా సమయాల్లో అలవోకగా వాడేశారు. అందుకే పదేళ్ల కాలంలో ఎన్నోసార్లు కేసీఆర్ భాషపై మేధావుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యేవి.

రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ సంప్రదాయాన్ని నిలబెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. కేసీఆర్ కన్నా పదాకులు ఎక్కువే చదివినట్టుగా రేవంత్ రెడ్డి మాటతీరు ఉంది.

డిసెంబరు నుంచి ఇప్పటిదాకా..
డిసెంబరు నుంచి ఇప్పటిదాకా అనేకసార్లు కేసీఆర్‌పైనా, ఆయన కుటుంబంపైనా, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినవారి పైనా రేవంత్ విమర్శలు చేసినప్పటికీ..తుక్కుగూడ సభలో మాత్రం ఆయన అన్ని హద్దులూ చెరిపేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్సాహపరిచే క్రమంలోనో…శక్తిమంతమైన ప్రసంగం చేయాలన్న ఉద్దేశంతోనో…ప్రతీకారేచ్ఛ ప్రతిధ్వనించాలన్న ఆలోచనతోనో కానీ…రేవంత్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా మాట్లాడారు.

ఇక కేసీఆర్ విషయానికొస్తే…కేసీఆర్ ప్రసంగాలను అభిమానించేవారు తెలంగాణలోనే కాకుండా…ఏపీలోనూ భారీ సంఖ్యలో ఉంటారు. కానీ ఆ ప్రసంగాల్లో ఆయన వాడే పదాలపై చాలామందికి అభ్యంతరాలున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడారు సరే అనుకుంటే..ప్రతిపక్షనేతగా మారిన తర్వాతా ఆయన వైఖరిలో మార్పు రాలేదు. సూర్యాపేట, కరీంనగర్‌లో ఆయన చేసిన ప్రసంగాలే దీనికి నిదర్శనం

వీటి గురించి ఆలోచించరా?
ఎవరు అధికారంలో ఉన్నా.. ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా… నేతలు ఇలా విమర్శలు, ప్రతివిమర్శలు, దాడులు, ప్రతిదాడులకు పరిమితమవుతున్నారు తప్ప రాష్ట్రం గురించి, ప్రజల అభివృద్ధి గురించి, పాలనలో మెరుగుపర్చాల్సిన సౌకర్యాల గురించి, హామీల అమలు గురించి, పేదలకు జరగాల్సిన న్యాయం గురించి ఎవరూ మాట్లాడడం లేదు. తిట్ల దండకంలో, హద్దూ, అదుపూ లేని పదాల వాడకంలో అధికార, ప్రతిపక్ష నేతలు కొత్త ఎత్తులకు చేరుతున్నారు.

ఎవరు ఎక్కువ తిట్లు తిట్టగలం అనేదానిపై నేతలు ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు తప్ప. .ప్రజలకు మంచి చేయడానికి పోటీపడడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్, కేసీఆరే కాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్‌లోని ఇతర నేతలు, వారితో పాటుగా బీజేపీ నేతలూ ఇలాగే నోటికి పనిచెప్పడంలో కొత్త రికార్డులు సృష్టించడానికి తహతహలాడుతున్నారు. ఈ తీరుపై తెలంగాణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లోనూ రాజకీయాలు ఇలాగే ఉంటే..పార్టీలకతీతంగా నేతలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమయ్య ప్రమాదముంది.

Congress: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్‌ నేతలు.. వరుసగా ఏం జరిగిందో తెలుసా?