×
Ad

Cm Revanth Reddy: నల్లమల అడవుల్లో నుంచి వచ్చా.. నన్ను గెలక్కు..!- సీఎం రేవంత్ మాస్ వార్నింగ్..

రోడ్ల మీద తిరిగే వాళ్ళకు బెంజ్ కార్లు వచ్చాయి. ఎర్రవల్లిలో ఒకాయనకు వెయ్యి ఎకరాల భూమి వచ్చింది.

Cm Revanth Reddy: కొడంగల్ లో కొత్త సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు. వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాతోని తమాషాలు చేయొద్దు, నన్ను గెలకొద్దు అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వని శపథం చేశారు రేవంత్.

కొత్తగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్ది గ్రామం, తండాలకు రోడ్లు వేసుకుందామని పిలుపునిచ్చారు. గుడి, బడి నిర్మాణంతో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ఒక ఇండస్ట్రియల్ పార్క్ ను అభివృద్ధి చేసుకుందామన్నారు. చదువుకున్న వాళ్లకు కొడంగల్ లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేసుకుందామని పిలుపునిచ్చారు.

”ఎన్నికలు ముగిశాయి. పార్టీలు పంథాలకు పోవద్దు. ఎవరి పట్ల వివక్ష వద్దు. అందరినీ కుటుంబసభ్యులుగా కలుపుకొని పోదాం. పదేళ్లలో గెలిచినా ఓడినా మీ మధ్యే తిరిగా. ఎక్కడ గెలిచే అవకాశం ఉన్నా ఇక్కడే పోటీ చేశా. ఈ ప్రాంతం నా కుటుంబం, ప్రాణంతో సమానం. అందుకే ఇక్కడికి వచ్చి మళ్ళీ పోటీ చేశా. ఇంతకన్నా పెద్ద పదవి వచ్చేది లేదు. రాష్ట్రంలో నూతన సర్పంచ్ లకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ గ్రామానికి ఏం కావాలో ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. సాధారణ నిధులు కాకుండా ప్రత్యేకంగా చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షలు, పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు ఇస్తాం. సీఎం నిధి నుంచి నేరుగా సర్పంచ్ లకు పంపిస్తాం.

రెండేళ్లలో గత ప్రభుత్వం ఇవ్వని రేషన్ కార్డులు ప్రతి గ్రామంలో ఇచ్చాం. రాష్ట్రంలో 3 కోట్ల 10 లక్షల మందికి సన్న బియ్యం ఇస్తున్నాం. తెలంగాణ ఉద్యమమే నీళ్ళు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది. రెండుసార్లు కేసీఆర్ కు అవకాశం ఇచ్చారు. పదేళ్లలో ఏ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. మక్తల్, కొడంగల్ నారాయణపేట ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారు. ఏ ప్రాజెక్ట్ పూర్తి చేయకున్నా 1 లక్ష 83 వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చారు. వాళ్ల కుటుంబం వేల కోట్లు కమీషన్లు కొట్టింది.

రోడ్ల మీద తిరిగే వాళ్ళకు బెంజ్ కార్లు వచ్చాయి..

రోడ్ల మీద తిరిగే వాళ్ళకు బెంజ్ కార్లు వచ్చాయి. ఎర్రవల్లిలో ఒకాయనకు వెయ్యి ఎకరాల భూమి వచ్చింది. జన్వాడలో ఇంకో ఆయనకు వంద ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. మరొకాయనకు మొయినాబాద్ లో ఫామ్ హౌస్ వచ్చింది. రెండేళ్ల తర్వాత ఆయన వచ్చాడు, మంచి చెప్తాడు అనుకున్నా. నా మీద 181 కేసులు పెట్టి చంచల్ గూడ జైల్లో పెట్టారు. నా కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారు. నేను అధికారంలోకి వచ్చాక ఆయన పాపాన ఆయన పోతాడని వదిలేశా. ప్రమాణ స్వీకారం రోజు నడుము విరిగి కింద పడ్డాడు.

ఫామ్ హౌస్ ను బందీఖానాలా మార్చుకున్నాడు. చుట్టూ నా పోలీసులే ఉన్నారు. ఎవరి పాపానికి వాళ్ళు పోతారని వదిలేశా. రెండేళ్ల తర్వాత వచ్చి తోలు తీస్తా అన్నాడు. మా సర్పంచ్ లు తీస్తారు రా మరి. నిన్ను చీరి చింతకు కట్టి చింతమడకలో వేలాడదీసి కొడతారు. 40 ఏళ్లు రాజకీయాలు చేశానంటావ్. ఫ్యూచర్ సిటీ గురించి తొక్క, తోలు అని మాట్లాడతారా? నేను కనుక మాట్లాడితే మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ లో ఉరేసుకోవాలి. నాతోని తమాషాలు చేయకు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆదాయం పెంచుతుంది. అభివృద్ధి జరుగుతుంది.

2029 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తా..

2029 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. అప్పటికి 119 సీట్లే ఉంటే.. 80కి పైగా సీట్లతో మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఒక వేళ 153 సీట్లు పెరిగితే 100 పైగా సీట్లతో మా ప్రభుత్వం తెస్తాం. కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను.. ఇదే నా శపథం. బీఆర్ఎస్, కేసీఆర్ గతమే.

మీరు అడిగినన్ని రోజులు సభ నిర్వహిస్తాం. దేని మీద చర్చిద్దామో రండి మేము సిద్ధం. నిజమైన చర్చ అసెంబ్లీలో చర్చిద్దాం. ఖాళీగా ఉన్నావ్ కాబట్టి మీటింగ్ లు పెట్టుకోకపోతే సంతలో పశువులు కాయు. కూలిన కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ అనేక అంశాలపై చర్చిద్దాం రా. వాటా ఇవ్వాల్సి వస్తుందని మెడలు పట్టి చెల్లెను బయటకు గెంటేశారు. ఇంకో ఆయన ఆరడగులు ఉంటాడు. మెదడు ఎక్కడుందో తెలీదు. ఇప్పటికైనా మారండి. ప్రతిపక్షం లేదని బయటకు పోతే ఇజ్జత్ పోయేటట్టు ఉంది. మార్చిలోపు 3వేల కోట్ల నిధులు తెచ్చే బాధ్యత నాది” అని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.

Also Read: తెలంగాణలో వారందరికీ బిగ్‌షాక్.. ప్రభుత్వ పథకాలు కట్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..