తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

వరి దిగుబడిలో సాధించిన ఈ రికార్డ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందన్నారు.

Record Paddy Production In Telangana (Photo Credit : Google)

Record Paddy Production : తెలంగాణ గట్టు మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. కాళేశ్వరంలోని మూడు బ్యారేజ్ లు పని చేయకున్నా రికార్డ్ స్థాయిలో వరి ఉత్పత్తి జరిగిందని చెబుతోంది ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రచారం పటాపంచలైందని, వరి దిగుబడి రైతులు సాధించిన విజయం అంటోంది కాంగ్రెస్.

తెలంగాణ రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి సాధించిందని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఖరీఫ్ సీజన్ లో 153 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వచ్చిందని తెలిపింది. దేశ చరిత్రలోనే ఈ రేంజ్ లో వరి పంట దిగుబడి రావడం ఇదే మొదటిసారి అని సివిల్ సప్లయ్స్ శాఖ ప్రకటించింది. ఈ సీజన్ లో 66 లక్షల 77 వేల ఎకరాల్లో వరి సాగు జరిగితే.. కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మూడు బ్యారేజ్ లు పని చేయకున్నా.. దండిగా పంటలు పండాయని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటా పంచలైందన్నారు. ఇది తెలంగాణ రైతులు సాధించిన ఘనత అంటూ కొనియాడారు. రైతుల శ్రమ, కష్టం ఫలించిందన్న సీఎం రేవంత్.. తెలంగాణ రైతులు దేశానికే గర్వ కారణం అన్నారు.

వరి దిగుబడిలో తెలంగాణ రికార్డ్ సృష్టించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. 66.77 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తే 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యిందన్నారు. ధాన్యం దిగుబడి ఘనత ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు చెందిన మూడు బ్యారేజ్ లు పని చేయకపోయినా వరి దిగుబడిలో సాధించిన ఈ రికార్డ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే కాదు యావత్ భారత దేశంలోనే ఇంతటి ధాన్యం దిగుబడి అరుదైన రికార్డ్ అయ్యారు.

 

Also Read : కాంగ్రెస్ సర్కార్ రివెంజ్ పాలిటిక్స్ చేస్తోందా? బీసీలకు కాంగ్రెస్ ఇచ్చే గ్యారెంటీ ఏంటి? వీకెండ్ విత్ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్..