Cold Intensity Increases
Cold Intensity Increases : మొన్నటి వరకు ఎడతెరిపిలేని వర్షాలతో ఇబ్బందులు పడిన ప్రజలకు ప్రస్తుతం చలి చుక్కలు చూపిస్తోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
గత వారం రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని చలి గాలుల ప్రభావం పెరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. నవంబర్ 13 నుంచి 17 మధ్య ఆయా జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక హైదరాబాద్ నగరంతోపాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 11 నుంచి 14 డిగ్రీల సెంట్రిగేడ్ మధ్య నమోదవుతాయని తెలిపింది.
మంగళవారం ఉదయం ఆసిఫాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8.7డిగ్రీల టెంపరేచర్ తో ఈ ఏడాది రాష్ట్రంలోనే అత్యంత చలి ప్రాంతంగా రికార్డు నమోదైంది. అదిలాబాద్ జిల్లాలో 10.2 డిగ్రీలు, నిర్మల్ 11.7 డిగ్రీలు, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ నగరంలో.. హెచ్సీయూలో 13.4 డిగ్రీల సెల్సియస్, రాజేంద్ర నగర్ ప్రాంతంలో 14.7డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇదిలాఉంటే.. నవంబర్ 13 నుంచి 17వ తేదీ మధ్యలో తెలంగాణలో చలి మరింత ఎక్కువ తీవ్రంగా ఉంటుందని, అప్పుడు రాత్రివేళ ఉష్ణోగ్రతలు 9డిగ్రీల సెల్సియస్ కు పడిపోతాయని వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చలి భారి నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది.
ఉదయం, రాత్రి సమయాల్లో చలి తీవ్రత ఎక్కువ ఉంటుండటంతో ఆ సమయాల్లో బయటకు వచ్చేవారు చలి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వచ్చేటప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే ఉన్ని దుస్తులు, స్వెట్టర్లు, కోట్లు ధరించాలని, ముఖ్యంగా చెరవులును, తలను, చేతులను, పాదాలను గ్లౌజులు, స్కార్ఫ్ లు, సాక్స్ లతో కప్పుకోవడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు.
చల్లటి పదార్థాలు, ఐస్‌క్రీమ్‌లు, ఫ్రిజ్‌లో పెట్టిన నీళ్లు లేదా పానీయాలు తాగడం పూర్తిగా మానుకోవాలి. ఎక్కువగా వేడి ఆహారాన్ని తీసుకోవాలి. శరీరానికి వేడినిచ్చే ఆకుకూరలు, సజ్జలు, జొన్నలు వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. చలి కారణంగా చర్మం పొడిబారకుండా ఉండటానికి, స్నానం చేసిన తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు మాయిశ్చరైజర్లు, వాస్లైన్ లేదా కొబ్బరి నూనెను చేతులు, కాళ్లు, ముఖానికి రాసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ ‘సి ‘ ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ, జామ వంటి పండ్లు తీసుకోవాలి. అల్లం, పసుపు, వెల్లుల్లి కూడా మంచివి.