హైదరాబాద్‌లో కొత్త తరహా దందా మొదలైంది. కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్టుగా వ్యవహారం తయారైంది. డబ్బు ఆశతో కొందరు వ్యక్తులు కొత్త దోపిడీకి తెరలేపారు. ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని తమకు అనుకూలంగా చేసుకుని క్యాష్ చేసుకుంటున్నారు. ఎదుటి వారి అవసరాన్ని తమ పెట్టుబడిగా చేసుకుని జేబులు నింపుకుంటున్నారు. కరోనా కాలంలోనూ కాసుల కక్కుర్తితో అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా అలాంటి వ్యాపారం ఒకటి వెలుగులోకి వచ్చింది.
కరోనాలోనూ కాసుల కక్కుర్తి:
అందానికి మెరుగులు దిద్దే బ్యూటీ పార్లర్‌ను ఐసోలేషన్ సెంటర్‌గా మార్చేశారు కొందరు ప్రబుద్ధులు. నిబంధనలను తుంగలో తొక్కి కోవిడ్ రోగులకు గదులు అద్దెకు ఇస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లోని కలర్స్ బ్యూటీ పార్లర్‌లో ఈ దందా జరుగుతోంది. కరోనా పాజిటివ్ వ్యక్తులకు ఆశ్రయం ఇస్తూ రోజుకు రూ.10వేల ఫీజు వసూలు చేస్తున్నారు నిర్వాహకులు. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు గదులు అద్దెకిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ అక్రమ దందాను పోలీసులు అడ్డుకున్నారు. బ్యూటీ పార్లర్ నిర్వహకులను అదుపులోకి తీసుకుని విచారణకు తరలించారు.
నిబంధనలకు విరుద్ధంగా కరోనా రోగులకు అద్దెకు గదులు:
ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా గత 15 రోజులుగా కరోనా బాధితులను చేర్చుకుంటున్నారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న ఇన్‌ఛార్జి వైద్యాధికారి అమీర్, జూబ్లీహిల్స్ ఎస్సై శేఖర్ శనివారం(జూలై 4,2020) ఆ కేంద్రంలో తనిఖీలు నిర్వహించగా.. అసలు విషయం వెలుగుచూసింది. అప్పటికే అక్కడున్న మూడు జంటలను పోలీసులు బయటకు పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్యూటీ స్టూడియో నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.
కరోనాతో గేమ్స్ వద్దు:
హైదరాబాద్‌లో కరోనా వైరస్ కేసులు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. దీంతో జనం కరోనా పేరు చెబితేనే హడలిపోతున్నారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కరోనాతో గేమ్స్ ఆడటం మంచిది కాదు. కోవిడ్ పట్ల జనానికి ఉన్న భయాన్ని కొందరు వ్యాపారులు ఈ విధంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్స్ లక్షలకు లక్షలు డబ్బు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వస్తుండగా.. ఇప్పుడు ఈ కొత్త దందా మొదలైంది. కరోనా సోకిన వారు ఐసోలేషన్ లో ఉండటానికి వీలుగా గదులు అద్దెకు ఇవ్వాలంటే చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎంతో కేర్ ఫుల్ గా ఉండాలి. కానీ ఆ బ్యూటీ పార్లర్ నిర్వాహాకులు డబ్బు కోసం కక్కుర్తి పడ్డారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. ఇలాంటి చర్యలను అస్సలు ఉపేక్షించేది లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అలాంటి ఐసోలేషన్ కేంద్రాల జోలికి వెళ్లకూడదని సూచించారు. లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించారు.