Venkatrami Reddy: వెంకట్రామిరెడ్డిపై అవినీతి ఆరోపణలు.. రాజీనామా ఆమోదంపై కాంగ్రెస్ ఆగ్రహం

సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్రామి రెడ్డి రాజీనామాను ఆమోదించడానికి వీల్లేదన్నారు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు.

Congress

Venkatrami Reddy: సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్రామి రెడ్డి రాజీనామాను ఆమోదించడానికి వీల్లేదన్నారు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు. ఎమ్మెల్సీ నామినేషన్‌ను తిరస్కరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తుంది కాంగ్రెస్.

ఈ క్రమంలోనే అసెంబ్లీ ప్రాంగణంలో మండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసి వెంకట్రామిరెడ్డిపై ఫిర్యాదు చేయనున్నారు కాంగ్రెస్‌ నేతలు.

ఉమ్మడి మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి భూ ఆక్రమాలకు సహకరించారని తెలంగాణ కాంగ్రెస్‌ ఆరోపిస్తుంది. దుబ్బాక ఉపఎన్నిక సమయంలోనూ టీఆర్‌ఎస్‌కు సహకరించారని ఆరోపించారు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు.

ఉమ్మడి రాష్ట్రంలోని సీఎంలకు అత్యంత ప్రీతిపాత్రుడైన వెంకట్రామిరెడ్డిని ఉమ్మడి మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా సీఎం కేసీఆర్ నియమించారని వెల్లడించారు.

సీఎంలకు వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టడం వంటి నైపుణ్యాలు వెంకట్రామిరెడ్డిలో ఉన్నాయని ఆరోపించారు. గతంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో కూడా వెంకట్రామిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షులు.

వెంకట్రామిరెడ్డిపై ఫిర్యాదులు విచారణలో ఉండగా అతని రాజీనామాను ఎలా ఆమోదిస్తారు అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.