Naveen Yadav
Naveen Yadav : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, BRS అభ్యర్థి మాగంటి సునీతపై 24వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి నవీన్ యాదవ్ ఆధిక్యం రౌండ్ రౌండ్‌కు పెరిగింది. మరోవైపు ఏ ఒక్క రౌండ్‌లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. నవీన్ యాదవ్ విజయంతో కాంగ్రెస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. గాంధీ భవన్ వద్ద జరిగిన కాంగ్రెస్ పార్టీ సంబురాల్లో పలువురు నేతలు, మంత్రులు పాల్గొన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 98,988 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74, 259 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి డిపాజిట్లు కోల్పోయారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ యాదవ్ కు ఆర్వో సాయిరాం గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేశారు. అనంతరం నవీన్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన దుష్ప్రచారానికి ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని అన్నారు. కక్షా రాజకీయాలు చేయమని.. అందరం కలిసి మన ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడదామని నవీన్ యాదవ్ పేర్కొన్నారు.