Telangana Congress Government : తెలంగాణలో కీలక అధికారుల మార్పునకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో ‘మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి’అనే నినాదంతో విజయఢంకా మోగించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురువారం కొలువుతీరనుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఏనుముల రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలోని కీలక మైన అధికారుల మార్పునకు సీఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారని సమాచారం....

Revanth Reddy

Telangana Congress Government : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో ‘మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి’అనే నినాదంతో విజయఢంకా మోగించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురువారం కొలువుతీరనుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఏనుముల రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలోని కీలక మైన అధికారుల మార్పునకు సీఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారని సమాచారం.

కేసీఆర్ హయాంలోని అధికారులపై బదిలీవేటు?

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కీలక స్థానాల్లో పనిచేసిన ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను తప్పించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రణాళిక రూపొందించారని అంటున్నారు. కేసీఆర్ పదినెలల క్రితమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎ. శాంతికుమారిని నియమించారు. చీఫ్ సెక్రటరీని కొనసాగిస్తారా? లేదా కొత్త వారిని తీసుకువస్తారా అనేది సచివాలయం వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

బీహార్ అధికారుల బదిలీ?

కేసీఆర్ హయాంలో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన బీహార్ రాష్ట్రానికి చెందిన ఐఎఎస్ అదికారులను మారుస్తారని భావిస్తున్నారు. కేసీఆర్ పాలనలో కీలక పాత్ర పోషించిన మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులను పక్కకు తప్పిస్తారని ప్రచారం సాగుతోంది. పలువురు ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల తమకు కీలక పదవులు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ నేతలను కలిసి ప్రయత్నాలు ప్రారంభించారు.

తెలంగాణ అధికారులకు కీలక పదవులు

పరిపాలనలో బీహార్ అధికారులకు బదులు తెలంగాణ అధికారులకు కీలక స్థానాలకు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. డీజీపీగా ఉన్న అంజనీకుమార్ ను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. మరో వైపు హైదరాబాద్ నగర పోలీసు కమిషనరుగా పనిచేసిన సీవీ ఆనంద్ ను ఈసీ బదిలీ చేసింది. డీజీపీగా రవి గుప్తా, హైదరాబాద్ నగర పోలీసు కమిషనరుగా సందీప్ శాండిల్యా పనిచేస్తున్నారు.

key officials

కీలక పోస్టుల కోసం అధికారుల పైరవీలు

తెలంగాణకు చెందిన ఐఎఎస్ అధికారులు బుర్రా వెంకటేశం, రాహుల్ బొజ్జా, ఐపీఎస్ అధికారులు శివధర్ రెడ్డిని కీలక స్థానాల్లోకి తీసుకువస్తారని ప్రచారం జరుగుతోంది. కేంద్ర సర్వీసులో ఉన్న కొందరు ఐఎఎస్ అధికారులు సైతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పోస్టులు సంపాదించేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ నేతల ద్వారా పైరవీలు ప్రారంభించారు. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఓఎస్డీగా ఉన్న ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు.

ALSO READ : Revanths Cabinet : రేవంత్‌ క్యాబినెట్‌పై ప్రొ.నాగేశ్వర్‌ విశ్లేషణ

ఏసీబీ డీజీపీగా ఉన్న రవి గుప్తా ప్రస్థుతం తాత్కాలిక డీజీపీగా ఉన్నారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ అధిపతి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్ పదవులు, జిల్లాల ఎస్పీలను బదిలీ అవకాశం ఉంది. దీంతో పాటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతల పట్ల వివక్ష చూపిన పోలీసు అధికారులపై బదిలీ వేటు వేస్తారని ప్రచారం జరుగుతోంది.

ALSO READ : Bandi Sanjay : బీజేపీ అధ్యక్షుడిగా మళ్లీ బండి సంజయ్? అందుకోసమేనా

మొత్తంమీద కొత్త కాంగ్రెస్ పాలనలో కీలక స్థానాల్లో అధికారుల మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధికారుల నియామకాలు, బదిలీల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమర్ధులైన అధికారులను కీలక స్థానాల్లో నియమించనుందని భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు