ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇక నుంచి మరోలెక్క.. కాంగ్రెస్ పార్టీలో గుజరాత్ మోడల్?

మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు గుజరాత్ మోడల్ గురించే తెగ చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీలో గుజరాత్ మోడల్ అంటేనే అంతా ఉలిక్కిపడుతారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ మోడల్ అంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చి వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. గుజరాత్ మోడల్ అంటేనే ఉలిక్కిపడే కాంగ్రెస్ పార్టీ..కమలం మోడల్ నే ఫాలో కావాలని అనుకుంటుందట. పార్టీలో కీలక సంస్కరణలు తీసుకురావాలని చూస్తుందట. గుజరాత్ లో మొదలు పెట్టిన ఈ రిఫామ్స్ ను దేశ వ్యాప్తంగా అమలు చేయాలనే ఆలోచనలో ఉందట పార్టీ హైకమాండ్. ఇంతకీ గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తున్న ఆ రిఫామ్స్ ఏంటి..? ఎందుకోసం సంస్కరణలు చేయాలని హస్తం పార్టీ భావిస్తుంది..? వాచ్ దిస్ స్టోరీ.

వరుస విజయాలతో బీజేపీ దూకుడుమీదుంటే..వరుస వైఫల్యాలతో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఢీలాపడిపోతోంది. ఒకప్పుడు వెయ్యి ఓల్టులున్న బల్బులా ఓ వెలుగు వెలిగి..ఇప్పుడు ఢీలా పడుతుండడంపై పార్టీలో పోస్టుమార్టం జరుగుతుందన్న టాక్ ఢిల్లీవర్గాల్లో విన్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టిందట. గతంలో మాదిరిగానే కాంగ్రెస్ పార్టీని పరుగులు పెట్టించాలని..పార్టీకి నూతన జవసత్వాలు అందించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారంట.

Also Read: కూతురి ఎంట్రీతో మాజీ మంత్రి అవంతికి లైన్ క్లియర్ అయినట్లేనా?

కాలం మారుతోంది…మనం కూడా మారాలి అన్న ధోరణితో పార్టీని సంస్కరించాలన్న ఆలోచనకు హస్తం పార్టీ వచ్చిందట. అందుకే ఓల్డ్ ఏజ్ పార్టీకి న్యూ లుక్ ఇచ్చేందుకు సరికొత్త రిఫామ్స్ కు తెరతీయబోతుందట AICC. గత అనుభవాలను ఉపయోగించుకుంటూనే పార్టీకి కొత్త లుక్కు వచ్చేందుకు నూతన విధానాలకు శ్రీకారం చుట్టబోతున్నారట. పార్టీలోకి యువరక్తాన్ని ఎక్కించి సరికొత్త రీతిలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని హైకమాండ్ పెద్దలు వ్యూహాలకు పదును పెడుతున్నారన్న టాక్ ఢిల్లీవర్గాల్లో విన్పిస్తోంది.

కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు సరికొత్త విధానాలను తీసుకురావాలని పార్టీ హైకమాండ్ చూస్తోందట. అందుకే ఈ మధ్య కాలంలో నిర్వహించిన AICC కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా అధ్యక్షుల ఎంపిక..విధి విధానాలు, పార్టీలో వారి పాత్ర తదితర విషయాల్లో సూపర్ పవర్ ని చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటూ పార్టీలో డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ..డీసీసీ బాస్ మాటే ఫైనల్ అన్న మాట.

డీసీసీ అధ్యక్షుడి ఎంపిక విధానంలో మార్పులు
అలా డీసీసీకి విస్త్రత అధికారాలను కట్టబెట్టింది పార్టీ అధిష్టానం. ఇప్పటి వరకు డీసీసీ అంటే కేవలం పార్టీలో ఒక పోస్టు మాత్రమే. పార్టీకి సంబంధించిన కీలక విషయాల్లో వారి పాత్ర నామ మాత్రంగానే ఉండేది. కానీ ఇన్నాళ్లు ఒక లెక్క..ఇక నుంచి మరోలెక్క అన్నట్లుగా ఉండనుందట. పార్టీ తరపున ఎన్నికల బరిలో ఎవరు నిలవాలన్నా డిసైడ్ చేసేది ఇక నుంచి డీసీసీ ఛాయిస్ ఉండనుందట.

పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో డీసీసీకి నేరుగా ఆహ్వానం ఉండనుందట. సంబంధిత జిల్లాకు చెందిన అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థి ఎంపికలో డీసీసీ అధ్యక్షుడి ఆమోదం తప్పనిసరి చేశారు. అందుకే డీసీసీకి రాష్ట్ర స్థాయిలో ఉండే PAC…పొలిటికల్ అడ్వైజర్ కమిటీని జిల్లా స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తున్నారట. ఇక నుంచి డీసీసీ పవర్ ఫుల్ పోస్ట్ కావడంతో.. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక విధానాన్ని పూర్తిగా మార్చేశారు.

జిల్లా కాంగ్రెస్ కమిటీ..డీసీసీ అధ్యక్షుడిని ఇన్నాళ్లు పీసీసీ చీఫ్ ఎంపిక చేసేవారు. కానీ ఇప్పుడు ఈ పోస్టు కాస్త పవర్ ఫుల్ కావడంతో ఎంపిక విధానం పారదర్శకంగా ఉండేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చారట. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం ఏఐసీసీ నుంచి ఒక పరిశీలకుడు వస్తారు…వీరికి రాష్ట్రం నుంచి ఇద్దరు పీసీసీ పరిశీలకులు సపోర్ట్ అవుతారు.

ఈ ముగ్గురు కలిసి జిల్లా అధ్యక్షుడి కోసం పోటీలో ఉన్న వారందరితో నేరుగా ఇంట్రాక్ట్ అవుతారు. డీసీసీకి అర్హతగా..పార్టీ పట్ల లాయల్టీ, పార్టీలో సీనియారిటీ, పార్టీ సిద్ధాంతం పట్ల అవగాహన ఈ మూడు ఉంటేనే డీసీసీ పోస్టుకు అర్హత సాధిస్తారు. ఈ సరికొత్త విధానాన్ని కాంగ్రెస్ పార్టీ మొదటగా గుజరాత్ లో ఇంప్లిమెంట్ చేస్తోంది. గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఈ నూతన విధానాన్ని దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని చూస్తోందట.

మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు గుజరాత్ మోడల్ గురించే తెగ చర్చ జరుగుతోంది. అక్కడ సక్సెస్ అయిన ఈ గుజరాత్ మోడల్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తుందో లేదే అనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది. అయితే ఈ ఏడాది చివరిలో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది 2026లో జరిగే అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు విజయం సాధిస్తుందో..పార్టీలో తీసుకొస్తున్న సరికొత్త సంస్కరణలు పార్టీని విజయతీరాలకు చేరుస్తాయా లేదా అనేది మరో ఏడాదిలో తేలిపోనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.