Congress Leader Rahul Gandhi To Tour In Telangana State May 6 To May 7th, 2022
Rahul Gandhi : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటన ఖరారైంది. ఈ మేరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో రాహుల్ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగనుందని ఆయన తెలిపారు. మే 6 నుంచి మే 7 వరకు రెండు రోజులు తెలంగాణలో పర్యటిస్తారని, ముందుగా వరంగల్ జిల్లాలో పర్యటిస్తారని రేవంత్ చెప్పారు. అనంతరం మే 7న హైదరాబాద్ లో పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నట్టు తెలిపారు. వరంగల్ పర్యటనలో భాగంగా రాహుల్ బహిరంగ సభలో పాల్గంటారు.
ఇప్పటికే రాహుల్ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారయినట్టు రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో రాహుల్ పర్యటనకు సంబంధించి హైదరాబాద్ గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులతో పార్టీ ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ సమావేశం అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి వివరాలతో పాటు పార్టీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా అవసరమైన కార్యాచరణను రూపొందించే అంశంపై తీవ్రంగా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
రైతులు, విద్యార్థులు, అమరవీరుల కుటుంబాల సమస్యలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని మనమే ఇచ్చామని, అందుకే మనమే ఇప్పుడు కాపాడుకుందామని రాహుల్ తెలంగాణలో పర్యటించనున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు రైతు సంఘర్షణ పేరుతో వరంగల్ సభ ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణలో 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించిందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా ట్విట్టర్‌లో 76వేల మంది రైతులు చనిపోతే రైతు బీమా ఇచ్చామని చెప్పారని రేవంత్ గుర్తు చేశారు. ఇంత మంది చనిపోయారంటూ కేంద్ర రాష్ట్ర గణాంకాలే చెబుతున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వరి వేస్తే ఉరే అని చెప్పిన వ్యక్తి సీఎం కేసీఆర్.. వరి సీడ్ అమ్మితే.. అంతు చూస్తా అన్న కలెక్టర్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారని రేవంత్ విమర్శించారు. రేపోమాపో మంత్రిని చేస్తానంటున్నారు. కేసీఆర్ మాటలు నమ్మి 20 లక్షల ఎకరాల్లో రైతులు పంట వేయలేదని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనని చెప్పడంతో 30 శాతం ధాన్యం తక్కువ ధరకు అమ్ముకున్నారని రేవంత్ చెప్పారు. 20 లక్షల ఎకరాల రైతులు నష్టపోయారని, 30 శాతం ధాన్యం అమ్మిన వారికి నష్ట పరిహారం చెల్లించాలన్నారు. కేసీఆర్ దొంగ మాటలు నమ్మని వ్యక్తులే బాగుపడ్డారని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
Read Also : Rahul Gandhi Tour: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన తేదీ ఖరారు: మే 6న వరంగల్‌లో భారీ బహిరంగ సభ