కాంగ్రెస్‌కు షాక్: బీజేపీలోకి రమేష్ రాథోడ్

ఆదిలాబాద్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రాథోడ్ బీజేపీ తీర్ధం పుచ్చుకోబోతున్నారు. గత కొన్ని రోజులుగా అనుచరులు, అభిమానులతో మాట్లాడిన అనంతరం రమేష్ రాథోడ్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రమేష్ రాథోడ్ బీజేపీలో చేరితే కాంగ్రెస్‌కు పెద్ద షాక్ అని అందరూ భావిస్తోండగా.. పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే తన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వారి అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీ మారాలనే యోచనలో రమేష్ రాథోడ్ ఉన్నారు.

రమేష్ రాథోడ్ 1999 – 2004 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మల్యేగా ఉన్నారు. 2006 నుండి 2009 వరకు అదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. 2009లో 15 వ లోక్ సభకు పోటీచేసి పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. నాగార్జున సాగర్ ఉపఎన్నికలకు ముందే.. రమేష్ రాథోడ్‌ను పార్టీలో చేర్చుకుని ఉపఎన్నికలో పావులు కదపాలని బీజేపీ భావిస్తోంది. లంబాడి, ఆదివాసీలకు దగ్గర వ్యక్తి కావడంతో రమేష్ రాథోడ్ చేరికను ఆ పార్టీ వర్గాలు కూడా స్వాగతిస్తున్నాయి.

అలాగే రమేష్ రాథోడ్‌తో పాటు.. పాల్వాయి హరీష్ కూడా బీజేపీ ఆకర్ష్ మంత్రంలో భాగాంగా బీజేపీ గూటికి చేరనున్నారు. లంబాడి వర్గానికి చెందిన రమేష్ రాథోడ్.. సిర్పూర్ కాగజ్ నగర్‌లో బలంగా ఉన్న పాల్వాయి హరీష్ తమ పార్టీలో చేరితే.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మరింత బలపడవచ్చునని బీజేపీ భావిస్తోంది.