V Hanumantha Rao: మూడోసారి ప్రధానమంత్రి అవుతున్న నరేంద్ర మోదీ బీసీలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హనుమంతరావు కోరారు. శుక్రవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లి మరోసారి మోదీని కలిసి కులగణన చేయాలని కోరతానని అన్నారు. నితీశ్‌కుమార్, చంద్రబాబు నాయుడు కూడా అన్ని రాష్ట్రాల్లో కులగణన కోరాలని సూచించారు. తెలంగాణలో కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు.
”మూడవ సారి ఎన్డీఏను గెలిపించి ప్రజలు మరోసారి మోదీకి అవకాశం ఇచ్చారు. ఓటర్ల తీర్పును గౌరవిస్తాం. మోదీ పదేళ్లు ప్రధానిగా ఉన్నా బడుగు బలహీనవర్గాలకు న్యాయం జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుల గణన చేస్తామని, రిజర్వేషన్లలో 50 శాతం సీలింగ్ ఎత్తివేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో నితీష్, చంద్రబాబుకే మోదీ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. వారిద్దరూ కూడా అన్ని రాష్ట్రాల్లో కుల గణన కోరాలి. బిహార్‌లో నితీశ్ కులగణన చేయిస్తే 67 శాతం బీసీలు ఉన్నారని తేలింది. రాహుల్ గాంధీ చేసిన ఆలోచనను కొనసాగించాలని ఓబీసీ కన్వీనర్‌గా నేను ఉండి రిజర్వేషన్లు పెంచాలని కోరాను.
Also Read: తెలంగాణ నుంచి కేంద్రమంత్రులు అయ్యేదెవరు.? ఆ 8 మందిలో అవకాశం దక్కేది ఎవరికి?
ఐఐటీల్లో కూడా రిజర్వేషన్ కోసం అన్ని పార్టీలు పార్లమెంటులో మద్దతు ఇవడం బిల్ పాస్ అయ్యింది. మండల్ కమిషన్ వచ్చింది కానీ బీసీలు చట్ట సభల్లో డబుల్ డిజిట్ కూడా దాటడం లేదు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయినా బీసీలకు న్యాయం జరగడం లేదు. మూడోసారి ప్రధానమంత్రి అవుతున్న మోదీ ఇకనైనా బీసీలకు న్యాయం చేయాలి. తెలంగాణలో కుల గణన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తే.. బీసీలకు మేలు జరుగుతుంది. కొంత ఆలస్యమైనా కులగణన తర్వాతే ఎన్నికలు పెట్టాలి. అసెంబ్లీలో కులగణన బిల్లు పాస్ చేయించే పని వెంటనే మొదలు పెట్టాల”ని వీహెచ్ అన్నారు.
Also Read: డిమాండ్ల సాధనకు, రాష్ట్రాల అభివృద్ధికి తెలుగు ఎంపీలకు ఇదే మంచి అవకాశం..!