Rajagopal Reddy
MLA Rajagopal Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి హుజూరాబాద్‌లో పోటి చేస్తున్న ఈటల రాజేందర్‌కు పరోక్షంగా మద్దతు తెలిపారు. ఈటలను ఓడించేందుకే హుజూరాబాద్‌లో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. దళిత బంధు పథకంపై నిప్పులు చెరుగుతున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ అంశంపై తీవ్రంగా మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తన నియోజకర్గానికి రూ.2వేల కోట్లు దళిత బంధు పథకం కింద మంజూరు చేస్తే తాను రాజీనామా చేసి ఆ సీటును టీఆర్ఎస్‌కు ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని రాజగోపాల్ రెడ్డి ఆందోళనకు దిగారు.
నేడు తన అనుచరులతో కలిసి నియోజకవర్గ హెడ్‌క్వార్టర్‌లో ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే నిరసన కార్యక్రమానికి బయలు దేరిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని అవుటర్ రింగ్ రోడ్డు దాటిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి పోలీసులపై మండిపడ్డారు. తనను అరెస్టు చేయడాన్ని ఖండించారు.