స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం కోటాపై కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి కీలక కామెంట్స్..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికోసం ప్రభుత్వం తీసుకుంటున్న మంచి నిర్ణయాలను ..

Renuka Chowdhury

Renuka Chowdhury : స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం పంచాయితీరాజ్ చట్టం-2018కి సవరణలు చేయాలని, త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది. దీంతో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు మండల యూనిట్‌గా, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు జిల్లా యూనిట్‌గా, జడ్పీ చైర్‌పర్సన్లకు రాష్ట్ర యూనిట్‌గా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. తాజాగా.. రాష్ట్ర కేబినెట్ నిర్ణయంపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి స్పందించారు.

రేణుకాచౌదరి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉంది. అందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు. 42శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కేటాయింపు పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇది రాజకీయ నిర్ణయం కాదని, సామాజికంగా గొప్ప మార్పునకు నాంది అని అభివర్ణించారు. బీసీ రిజర్వేషన్ నిర్ణయం వల్ల బీసీలకు రాజకీయాల్లోనే కాదు.. ఉద్యోగాల్లోనూ మెరుగైన అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు.

చిరునవ్వుతో 33శాతం మహిళలకు రిజర్వేషన్లపై రాజీవ్ గాంధీ సంతకం చేశారు.. మహిళ జీవితాలను మార్చారు. రాహుల్ గాంధీ హయాంలో సంచలనమైన నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని చెప్పారు. సమసమాజ నిర్మాణం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. అందరి న్యాయం.. అందరికీ అవకాశం కాంగ్రెస్ నినాదం అని.. జాతీయ స్థాయిలో ఈ విషయంపై చర్చ జరుగుతుందని రేణుకా చౌదరి అన్నారు.

యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికోసం ప్రభుత్వం తీసుకుంటున్న మంచి నిర్ణయాలను చూసి బీఆర్ఎస్ పార్టీ ఓర్వలేక పోతుందని రేణుకా చౌదరి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలి. ఆయన వందేళ్లు ఉండాలని కోరుకున్నారు. ఎందుకంటే వాళ్లు అలాగే ఉన్నప్పుడు మేము అధికారంలో ఉంటాం. ఎవరెవరో మాటలు చెప్పారు కానీ, చేసి చూపించింది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి. ఆయన చేసిన నిర్ణయం దేశానికి మార్గం చూపుతుంది. చేతి గుర్తు అన్నది దేశాన్ని ముందుకు నడిపే సత్తా ఉన్న చిహ్నం అని రేణుకా చౌదరి అన్నారు.