Congress
ఎన్నికల వేళ 14 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. మరో మూడు స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థులపై హస్తం నేతలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. హైదరాబాద్ అభ్యర్థి విషయంలో కూడా కాంగ్రెస్ ఈక్వేషన్స్ మారిపోయాయి.
ఇటీవల కాంగ్రెస్‌కు ఎంఐఎం దగ్గర కావడంతో.. అభ్యర్థి ఎంపిక ఇంకా కొలిక్కి రావడం లేదు. ఇక్కడి నుంచి మైనార్టీ నేతకే టికెట్ ఇవ్వాల్సి వస్తే పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు సమీర్ ఉల్లా లేదా సుప్రీంకోర్టు అడ్వకేట్ షెహనాజ్ తబస్సుమ్ పేరును పరిశీలిస్తున్నారు. లేదంటే హైదరాబాద్ పార్లమెంట్ నుంచి హిందూ అభ్యర్థిని బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే హైదరాబాద్ అభ్యర్థి విషయంలో ఇంకా తర్జనభర్జన కొనసాగుతూనే ఉంది.
ఖమ్మం సీటు హాట్ టాపిక్
ఇక ఖమ్మం సీటు కాంగ్రెస్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి ఖమ్మంలో ఒక్క సీటు మినహా మిగతా అన్నిచోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు కూడా హస్తం గూటికి చేరారు. దీంతో ఖమ్మం నుంచి పోటీచేస్తే గెలుపు ఈజీ అవుతుందని కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు నేతలు.
ముగ్గురు మంత్రులు తమ కుటుంబసభ్యులకు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. తన తమ్ముడికి టికెట్ ఇస్తే గెలిపించే బాధ్యత తీసుకుంటానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ పెద్దలకి చెప్పినట్టు సమాచారం. ఇక తన సతీమణి నందినికి టికెట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైకమాండ్‌ను కోరినట్లు తెలుస్తోంది.
ఇక మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగేందర్‌కు ఖమ్మం సీటు ఇవ్వాలని కోరుతున్నారు. సీనియర్ వి.హనుమంతరావు కూడా ఖమ్మం టికెట్ కోసం అధిష్ఠానాన్ని కలిశారు. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణలో భాగంగా ఎవరికి టికెట్ ఇస్తారనేది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
కరీంనగర్‌లో?
కరీంనగర్ ఎంపీ టికెట్ విషయంలోనూ కాంగ్రెస్ ఒక క్లారిటీకి రాలేకపోతోంది. కరీంనగర్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అధిష్ఠానం కోరగా ఆయన నిజామాబాద్ నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో కరీంనగర్ టికెట్ పెండింగ్ లో పడింది. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, పార్టీ నేత వెల్చాల రాజేందర్‌రావు టికెట్ ఆశిస్తున్నారు.
కరీంనగర్‌లో వెలమ సామాజికవర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండటంతో..ఆ సామాజిక వర్గానికి చెందిన రాజేందర్ రావు పేరు బలంగా వినిపిస్తోంది. ఇక కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని బీసీ నేతకు ఇస్తే బాగుంటుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో కరీంనగర్ అభ్యర్థి ఎంపిక పార్టీకి తలనొప్పిగా మారింది.
హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం మూడు సీట్ల అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పార్టీకి బిగ్ టాస్క్‌గా మారింది. ఈ మూడు సీట్లు ఒకదానిపై ఒకటి ముడిపడి ఉన్నట్లు హస్తం నేతలు చెబుతున్నారు. సామాజిక సమీకరణాల సర్దుబాటులో ఎవరికి టికెట్ దక్కుతుంది.. ఎవరు గట్టెక్కుతారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
Also Read: ఈ నెల 14 నుంచి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం.. ప్రతిపక్షాలపై ముప్పేట దాడికి స్కెచ్