Telangana Congress: తెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరు? ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం!

Telangana PCC chief: తెలంగాణ పీసీసీ చీఫ్ వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. ఇటీవల జరుగుతున్న పరిణామాలకు తోడు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఒకరి వెనుక ఒకరు ఢిల్లీకి బయలుదేరి వెళ్లడంతో టీపీసీసీ అంశం మరోమారు చర్చనీయాంశమైంది. పదవి ఆశిస్తున్న ఇద్దరు ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, మధుయాష్కి గౌడ్‌ హస్తిన బాట పట్టారు. దీనికి తోడు ఇటీవలే కేరళ రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించగా.., పంజాబ్‌లో పార్టీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించి కొత్త పీసీసీని ఎన్నుకునేందుకు కమిటీని ఏర్పాటు చేసింది అధిష్టానం. దీంతో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌ను ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం స్థాయిలో మరిన్ని చర్చలు జరగాల్సి ఉందని, ఆ తర్వాతే తేలుతుందని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధిపై కేంద్ర పెద్దలను కలుస్తున్న ఆయన కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ అపాయింట్‌మెంట్‌ కూడా అడిగినట్టు తెలుస్తోంది. కోమటిరెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలోనే మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కూడా హస్తిన బాట పట్టడంతో అసలేం జరుగుతుందనే చర్చ రాష్ట్ర కాంగ్రెస్‌లో మొదలైంది.

రేవంత్‌ తన వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీ వెళ్లినట్లు చెప్తున్నారు ఆయన అనుచరులు. అయితే పీసీసీ చీఫ్ అంశంపై పెద్దలను కూడా కలిసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంపై రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలందరితో మాట్లాడిన తర్వాతే అధిష్టానం ఈ విషయాన్ని తేలుస్తుందని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే త్వరలోనే చీఫ్ ఎంపీక ఉంటుందని చెప్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు