Cops Turn Walls Into Blackboards After Tribal Children Miss School
Walls converted into Boards: కరోనా కారణంగా పిల్లలకు చదువులు అందట్లేదు.. చాలామంది పిల్లలకు కొత్తగా చదువులు స్టార్ట్ చేయాలి అన్నా పాఠశాలలు తెరుచుకునే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో.. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పిల్లలకు రెండేళ్ల నుంచి చదువు సరిగ్గా అందని పరిస్థితి. అడవుల్లో ఉండే ఆదివాసుల పిల్లలకు బడులు మూతపడడంతతో చదువుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వం విద్యార్థుల కోసం ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నా కూడా.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్న గిరిజన విద్యార్థులు చదువుల్లేక చాలా నష్టపోతున్నారు. వారి నిస్సహాయ పరిస్థితిని గమనించిన కుమ్రంభీమ్-ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణీ మండల పోలీసులు వినూత్న ఆలోచనతో గోడలను బోర్డులుగా మార్చి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అవసరం అయ్యే ఆంగ్ల అక్షరాలను, తెలుగు వర్ణమాలలను, అంకెలను, ఎక్కాలను రాసి చదువులు చెప్పిస్తున్నారు.
గ్రామాల్లోని ప్రధాన కేంద్రాల గోడలపై చదువులను రాసి పిల్లలను చదవమని ప్రోత్సహిస్తున్నారు. గిరిజన గ్రామ పెద్దల అనుమతి తీసుకుని పోలీసులు మాంగి, కోలంగుడ, హాస్టల్ గుడా, రోంపెల్లి, మెస్రంగుడ, పంగిడిమాధరం, మొరిగుడ, తలండి మరియు తిర్యాణి మండలంలోని 30 గ్రామాలలో గోడలను చదువులతో నింపేశారు. ఇక్కడే చిన్న పిల్లలకు కొంచెం పెద్ద పిల్లలు, సీనియర్లు చేత వీటిని చెప్పిస్తున్నారు. ఊరిలోనే ఉండేవారితో.. బయట తిరుగుతూ ఉండే పిల్లలు అక్కడికి వచ్చి ఆడుతూ చదువుకుంటున్నారు.
ఎస్ఐ రామారావు చొరవతో ఇదంతా సాధ్యం అయ్యిందని పోలీసులు చెబుతున్నారు. సంవత్సరం పైగా పిల్లలకు చదువుల విషయంలో గ్యాప్ వచ్చిందని, వారు వారి జ్ఞాపకాలను తిరిగి పుంజుకోవడానికి ఈ ప్రక్రియ సాయం చేస్తుందని ఎస్‌ఐ రామారావు అభిప్రాయపడ్డారు. కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్క్‌లు వేసుకుని తిరుగుతూనే ఊరిలో ఇలా నేర్చుకునే వెసులుబాటు కల్పించినందుకు ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
గతంలో కూడా ప్రజలకు సహాయం చేయడానికి తిర్యాణి మండంలో ఎస్ఐ రామారావు ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పంగిడి కుగ్రామంలో గిరిజనుల కోసం మినీ వాటర్ ట్యాంక్‌ను కూడా నిర్మించారు. 30కుటుంబాలు నివసించే ఆ గ్రామంలో కలుషితనీటిని ప్రజలు తాగుతూ ఉండగా.. వారికోసం వాటర్ ట్యాంక్ కట్టించారు.